కంబళ వీరుడు.. 100 మీటర్లను 9.55 సెకన్లలో పరిగెత్తి గతేడాది సంచలనం సృష్టించిన శ్రీనివాస గౌడ.. ఈ ఏడాది డీలాపడ్డాడు. కర్ణాటక మంగళూరులోని హొక్కాడిగోలిలో నిర్వహించిన పోటీల్లో భారత 'హుస్సేన్ బోల్ట్' ఓడిపోయాడు.
ట్రాక్ మధ్యలోనే..
గతేడాది లాగే.. ఈసారి కూడా బురద మళ్లలో పోటీ నిర్వహించింది కంబళ కమిటీ. ఈ నెల 30-31న ఈ పోటీలు జరిగాయి. తన దున్నతో పరుగు ప్రారంభించిన శ్రీనివాస గౌడ.. ట్రాక్ మధ్యలోనే పడిపోయాడు. అతని శరీరం, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
3-4 రోజుల్లో గౌడ కోలుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 6న కాంతబారె, బోడబారె కంబళ పోటీల్లో గౌడ పాలుగొంటాడని అతని బృందంలోని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏమిటీ కంబళ?
ఇది ప్రధానంగా కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయబద్ధమైన పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది.
ఇదీ చూడండి:- బోల్ట్ కాదు.. శ్రీనివాస్ కాదు.. నిశాంత్ రికార్డు పరుగు