తమిళనాడు డెల్టా ప్రాంతంలోని తిరువరూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. పైంగనాడు తులసేంద్రపురం. అసలు ఎక్కడుందో తెలియని ఈ కుగ్రామం ఇప్పుడు ప్రపంచ దృష్టినే ఆకర్షిస్తోంది. అందుకు కారణం అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి కమలా హారిస్. కమల అమ్మమ్మ ఊరు ఇది. అందుకే, హారిస్ గెలవాలని ఊరు ఊరంతా కోరుకుంటోంది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక పట్ల సంతోషంతో వేడుకలు నిర్వహిస్తోంది.
మా ఊరి బిడ్డే..
హారిస్ తాతయ్య వీటీ గోపాలన్, అమ్మమ్మ రాజ్యం పైంగనాడు గ్రామానికి చెందినవారు. గోపాలన్ సివిల్ సర్వెంట్‌గా భారత ప్రభుత్వానికి సేవలందించారు. ఇప్పుడు వారి మనవరాలైన కమల ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. దీంతో కమల తమ ఊరి బిడ్డ కడుపున పుట్టడం గర్వకారణం అంటున్నారు గ్రామస్థులు. స్థానిక సెరుగా పెరుమాళ్ ఆలయ నిర్మాణానికి కమల కుటుంబ సభ్యలు విరాళాలు ఇచ్చిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఊరి అగ్రహారంలో కమల అమ్మగారి ఇంటిని గర్వంగా చూపించుకుంటున్నారు.
ఊరంతా కమల బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు గ్రామస్థులు. హారిస్ గెలుపునకై పెరుమాళ్ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా నెగ్గి.. అమ్మమ్మ ఊరికి ఓ సారి వచ్చిపోవాలని కోరుతున్నారు.
గర్వకారణమే..
దశాబ్దాలుగా అమెరికాలో భారత సంతతి వ్యక్తులు కార్పొరేట్, ఐటీ రంగాల్లో సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే, ఇప్పటివరకు అక్కడ రాజకీయాల్లో మాత్రం అగ్రస్థానం అందలేదు. ఇప్పుడు ఆ అవకాశం భారత సంతతి కమలా హారిస్‌కు దక్కింది. అందుకే, ప్రపంచంలోని భారతీయుల నుంచి ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో 'కమల' వికాసం