జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గత ఆదివారం జరిగిన హింసాత్మక దాడిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం వివరాలను బహిర్గతం చేసింది. పెరియార్ వసతి గృహంలో వామపక్ష విద్యార్థి సంఘాలే దాడికి పాల్పడ్డాయని తేల్చింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను మీడియాతో పంచుకున్నారు సిట్ అధికారి డాక్టర్ జాయ్ తిర్కే.
దాడి చేసినట్లుగా అనుమానిస్తున్న తొమ్మిది మంది పేర్లను వెల్లడించారు తిర్కే. ఇందులో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ తొమ్మిదిలో వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందినవారు ఏడుగురు ఉండగా.. ఇద్దరు మితవాద సంఘాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారందరికీ నోటీసులు జారీ చేశామన్న డీసీపీ....అయితే ఇప్పటివరకూఎవర్నీ అరెస్ట్ చేయలేదన్నారు. త్వరలోనే అనుమానితులను విచారణ చేయనున్నట్లు జాయ్ తిర్కే చెప్పారు.
9 మంది వీరే..
చంచన్ కుమార్, పంకజ్ మిశ్రా, అయిషీ ఘోష్, భాస్కర్ విజయ్, సుచేతా తాలుక్రాజ్, ప్రియా రంజన్, దోలన్ సావంత్, యోగేంద్ర భరద్వాజ్, వికాస్ పటేల్ ఈ దాడిలో పాలుపంచుకున్నట్లు తెలిపారు.
ఎక్కువ మంది విద్యార్థులు జనవరి 1-5 మధ్య శీతకాల సెమిస్టర్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలనుకున్నారు. కానీ వామపక్ష విద్యార్థి నేతలు అందుకు ఒప్పుకోలేదు.
జనవరి 5న పెరియార్ వసతి గృహంలో లక్ష్యంగా చేసుకున్న కొన్ని గదులపైనే దాడి జరిగిందని తిర్కే చెప్పారు.
ఘోష్ స్పందన
పోలీసుల ప్రకటనపై స్పందించారు అయిషీ ఘోష్. తనపై దాడి జరిగిందనడానికి ఆమె వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలిపారు.
"దేశంలోని న్యాయచట్టాలపై పూర్తి నమ్మకం ఉంది. విచారణ సక్రమంగా జరిగితే నాకు న్యాయం లభిస్తుంది. కానీ దిల్లీ పోలీసులు ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు? నా ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? నేను ఎవరిపైన దాడి చేయలేదు. నామీద జరిగిన దాడికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి."
- అయిషీ ఘోష్, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు
ఇక చాలు: జావడేకర్
పోలీసుల ప్రకటనపై స్పందించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్.. ఇకనైనా అల్లర్లను ఆపేసి విద్యాసంవత్సరం ప్రారంభించాలని సూచించారు. వామపక్ష పార్టీలు, ఆమ్ఆద్మీ.. విద్యార్థులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏబీవీపీ సంస్థపై నింద వేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు తేటతెల్లం చేశారని పేర్కొన్నారు.