ఉత్తర్ప్రదేశ్లో మరో పాశవిక ఘటన జరిగింది. ఓ మైనర్పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం బయటపడింది. ఝాన్సీ సిప్రి బజార్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్న బాలికపై 12 మంది కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న సిప్రి బజార్ పోలీసులు... 12 మందిపై అభియోగాలు మోపారు.
వీడియో రికార్డు
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. కళాశాల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కొంత మంది యువకులు వారి స్నేహితులతో కలిసి బాలికను అడ్డగించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. వారి క్రూర చర్యలను కెమెరాతో రికార్డు చేశారు. ఈ విషయం గురించి బయటకు చెప్తే వీడియోను వైరల్గా చేస్తామని బాలికను బెదిరించారు. వీడియోను అడ్డం పెట్టుకొని ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేశారు.
'వీడియో వైరల్ కాకుండా చర్యలు'
కేసు నమోదు చేసుకున్న తర్వాత నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లనున్నట్లు ఝాన్సీ సీనియర్ ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు.
"సిప్రి బజార్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని నిందితులు బెదిరించారు. ఈ కారణంగానే అమ్మాయి తొలుత తన కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. నిందితుల్లో ఒకరిని గుర్తించాం. మిగతావారి కోసం మా పోలీసుల బృందం గాలిస్తోంది. నిందితులందరూ యువకులే. వీడియో ఆన్లైన్లో ప్రసారం కాకుండా ప్రయత్నిస్తున్నాం."
-దినేశ్ కుమార్, ఝాన్సీ ఎస్ఎస్పీ
నిందితులపై ఐపీసీ సెక్షన్ 376(రేప్) ప్రకారం కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ల ప్రకారం అభియోగాలు మోపారు.
ఇదీ చదవండి- రూ.10 ఆశచూపి చిన్నారిపై అత్యాచారం