జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో కొనసాగడంపై జనతా దళ్ యునైటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. భాజపాతో జాతీయ స్థాయిలో వేరు పడి.. పొత్తును బిహార్‌కు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. త్వరలో జరిగే జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, హరియాణా, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తీర్మానించింది.
ఈ రోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది జేడీయూ.
అప్పుడే మొదలు
కేంద్ర మంత్రివర్గ కూర్పు సమయంలోనే భాజపా-జేడీయూ మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఒక కేబినెట్ మంత్రి, ఒక స్వతంత్ర హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవులను కేటాయించాలని జేడీయూ కోరింది. ఇందుకు భాజపా నిరాకరించింది. కేబినెట్లో జేడీయూకు ఒక్క స్థానమే ఇస్తామని తేల్చిచెప్పింది. ఫలితంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు జేడీయూ.
ఈ నెల 2న బిహార్‌లో మంత్రివర్గాన్ని విస్తరించారు నితీశ్. మంత్రి పదవి ఇచ్చేందుకు జేడీయూ సిద్ధమైనా... భాజపా తీసుకోలేదు. ఫలితంగా 8 మంది జేడీయూ నేతలు మాత్రమే కొత్తగా బిహార్ మంత్రివర్గంలో చేరారు.
నితీశ్‌కు భాజపా తప్పనిసరి
243 మంది ఎమ్మెల్యేలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ(73), భాజపా(54), ఎల్జేపీ(2), ఐఎన్డీ(4) కూటమిగా ఏర్పడి మొత్తం 133 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ(79), కాంగ్రెస్(27) కూటమికి మరిన్ని స్థానిక పార్టీలతో కలిపి మొత్తం 110 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ భాజపా-జేడీయూ విభేదాలు మరింత ముదిరితే... నితీశ్ కుమార్ పదవికే ఎసరు వచ్చే ప్రమాదముంది.
ఇదీ చూడండి: 'కిశోర్ వ్యవహారంతో మాకు సంబంధం లేదు'