Farmers Protesting Against Pharma Village : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర కోసం బయలుదేరిన నేతలను వికారాబాద్ జిల్లా బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి తరలించారు.
హకీంపేట రేణుకా ఎల్లమ్మతల్లి దేవాలయం నుంచి హకీంపేట్, ఆర్.బి తాండ, లగచర్ల మీదుగా దుద్యాల్ ఎమ్మార్వో కార్యాలయం వరకూ పాదయాత్ర కొనసాగాల్సి ఉండగా బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున హకీంపేటకు చేరుకున్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హకీంపేటకు చేరుకుని పాదయాత్రకు అనుమతి లేదని ఆందోళన కారులకు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి ఆందోళనకు మద్దతు తెలిపాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులను అరెస్ట్ చేశారు.
25రోజులుగా దీక్ష : ఫార్మా విలేజ్‌పై మొదటి నుంచి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోలెపల్లి, హకీంపేట, నగచర్ల, దుద్యాల, పులిచర్లకుంట తండాలో సుమారు 1700 ఎకరాల్లో ఫార్మా విలేజ్ పేరుతో ఔషధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాలుష్య కారకాలు వెదజల్లే పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమంటూ ఆయాగ్రామాల రైతులు ఆందోళనబాట పట్టారు. హకీంపేట చౌరస్తాలో సుమారు 25రోజుల నుంచి నిరాహార దీక్షలు చేశారు. ఇందులో భాగంగానే ఇవాళ పాదయాత్రకు సిద్ధమయ్యారు.
రిజిస్ట్రేషన్లు ఆపేశారు : ఫార్మా విలేజ్ కోసం భూముల సేకరణకు ఎంపిక చేసిన గ్రామాల్లో అంతా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని బాధితులు చెబుతున్నారు. ఎకరాకు 10లక్షల పరిహారం, ఇంటిస్థలం, ఇళ్లు ఇస్తామని అధికారులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఫార్మా విలేజ్ వస్తుందన్న పేరుతో తమ భూమలు రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావట్లేదని వాపోతున్నారు. భూములివ్వబోమని అధికారులకు ఇప్పటికే తేల్చి చెప్పినట్లు వెల్లడించిన రైతులు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం జిల్లాలో ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ఆందోళన - FARMERS PROTEST IN EKALAVYA SCHOOL
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు - పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ - FARMERS DEMAND COMPENSATION