సామాజిక మాధ్యమ యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అనుసంధానం చేసే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
మద్రాసు, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఫేస్‌బుక్ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే... ఆధార్ అనుసంధానం చేయాలా వద్దా అనే అంశం జోలికి వెళ్లమని, ఫేస్‌బుక్ బదిలీ పిటిషన్‌ను మాత్రమే విచారిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.
వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయడానికి అభ్యంతరం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఎందుకు..?
సామాజిక మాధ్యమాల్లో అసత్య, అశ్లీల, దేశవ్యతిరేక, ఉగ్రవాద భావజాలం వ్యాప్తిని అడ్డుకునేందుకు... యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. అయితే... ఇలా చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఫేస్‌బుక్ వాదిస్తోంది.