ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు కేరళ ప్రభుత్వం రూ. 1.30 కోట్ల పరిహారం చెల్లించింది. ఆయనపై కేరళ పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన 36 ఏళ్లకు ఈ పరిహారాన్ని అందజేసింది. గతేడాది రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోగా మంగళవారం అమలు చేసింది.
నారాయణన్‌పై తప్పుడు కేసులు పెట్టినందుకు సుప్రీం మొట్టికాయలు వేసింది. అనవసరంగా అరెస్టు చేసి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆ మొత్తాన్ని కేరళ ప్రభుత్వం అందజేసింది.
కేసు ఇదీ..
1994లో భారత 'క్రయోజనిక్ ఇంజిన్ ప్రోగ్రామ్' రహస్య సమాచారాన్ని నంబి నారాయణన్‌తో పాటు మరొక శాస్త్రవేత్త.. రష్యా, పాక్‌లకు అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వారిపై అదే సంవత్సరంలో కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
అయితే తనను అరెస్టు చేసినందుకు పరిహారం చెల్లించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై నంబి నారాయణన్ తిరువనంతపురం సబ్ కోర్టులో కేసు వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి వేధించారని.. అందుకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రభుత్వం.. నారాయణన్‌తో రాజీ కుదుర్చుకుంది. అనంతరం ఆయన కేసును ఉపసంహరించుకున్నారు.
కమిటీ సిఫార్సులతో..
కేరళ మాజీ సీఎస్ కె.జయకుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. నారాయణన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లు చెల్లించాలని 2019 డిసెంబర్లో కమిటీ సిఫార్సు చేసింది. ఈ మొత్తం సుప్రీంకోర్టు ఆదేశించిన రూ.50 లక్షలకు అదనం.
ఇదీ చూడండి: చిక్కుల్లో 'చందమామ' యాజమాన్యం