గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)తో చేతులు కలిపింది ఇస్రో. ఇందులో భాగంగా మానవ కేంద్రీకృత వ్యవస్థ (హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్స్)ను అభివృద్ధి చేయనుంది డీఆర్డీఓ. ఇదే అంశంపై ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది.
"కొన్ని క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలను ఇస్రోకు అందించనుంది డీఆర్డీఓ. అంతరిక్షంలో వినియోగించే ఆహారం, అత్యవసర మనుగడ కిట్, పారాచూట్లు సమకూరుస్తుంది. అలాగే సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణ, రేడియేషన్ స్థాయిలను గుర్తించి రక్షణ కల్పించే పరిజ్ఞానాన్ని ఇస్రోకు అందిస్తుంది డీఆర్డీఓ."
- భారత రక్షణ మంత్రిత్వ శాఖ
హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్సీ) డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ నేతృత్వంలోని ఇస్రో శాస్త్రవేత్తల ప్రతినిధి బృందం వివిధ డీఆర్డీఓ పరిశోధనశాలలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఫలితంగా డీఆర్డీఓ నుంచి ఇస్రోకు మానవ కేంద్రీకృత వ్యవస్థ, మానవ అంతరిక్ష మిషన్‌కు కావాల్సిన ప్రత్యేకసాంకేతిక పరిజ్ఞానాలు అందనున్నాయి.
'రక్షణ అనువర్తనాల కోసం డీఆర్డీఓ వినియోగిస్తున్న సాంకేతిక సామర్థ్యాలను గగన్‌యాన్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని' ఆ సంస్థ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇస్రో లక్ష్యం
2022 సంవత్సరంలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకల కంటే ముందుగానే.. గగన్‌యాన్ ద్వారా 'మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని' పరీక్షించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి: ఫేస్బుక్, ఇన్‌స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?