ఐపీఎస్ అధికారి కావాలంటే కఠోర శ్రమ, అంకిత భావం అవసరం. ఇదే స్ఫూర్తిని ఉద్యోగంలో చేరిన తర్వాతా కొనసాగిస్తున్నారు ఐపీఎస్ అధికారిణి అపర్ణ కుమార్. ఎత్తయిన పర్వతాలను అధిరోహించటమంటే ఆమెకు మహా ఇష్టం. దీనికోసం కోసం ఏకంగా ప్రపంచాన్నే చుట్టేశారు. దాదాపు అన్ని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. దృఢమైన సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అపర్ణ.
ఆఫ్రికాలో ఎత్తయిన 'కిలిమంజారో' పర్వతాన్ని 2014 మే లో అధిరోహించారు అపర్ణ. అదే ఏడాది నవంబర్‌లో ఇండోనేసియాలోని 'కార్స్టెంజ్ పిరమిడ్'నూ ఆరోహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నారు.
అపర్ణ అధిరోహించిన పర్వతాలు
⦁ 2014 'మే'లో ఆఫ్రికాలోని కిలిమంజారో.. నవంబర్‌లో ఇండోనేసియాలోని కార్ట్సెంజ్ పిరమిడ్.
⦁ 2015 జనవరిలో అర్జెంటీనాలో అకొంకాగ్వా, ఆగస్టులో రష్యాలోని ఎల్బ్రుజ్ పర్వతాలు.
⦁ 2016 జనవరిలో అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్,' మే' లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ
⦁ 2017 సెప్టెంబర్‌లో హిమాలయాల్లోని మౌంట్ మనాస్లు పర్వతం.
అపర్ణ కుమార్ 2002 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్‌లో ఇండో-టిబెటన్ సరిహద్దు దళం పోలీసు డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.
అపర్ణ కుమార్ స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ. బెంగళూరు నేషనల్ కాలేజ్ నుంచి బీఏలో డిగ్రీ పట్టా పొందారు. నేషనల్ లా స్కూల్లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.