కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అరెస్టుకు సంబంధించి ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో నేడు దిల్లీ కోర్టు తీర్పు వెలువరించనుంది. విచారణ నిమిత్తం చిదంబరాన్ని అరెస్టు చేసేలా ఆదేశాలివ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్... కోర్టును అభ్యర్థించింది.
చిదంబరం, ఈడీ తరఫున సోమవారం... న్యాయవాదుల వాదనల అనంతరం నేడు తీర్పు ప్రకటించనున్నట్లు వెల్లడించారు దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్. చిదంబరాన్ని విచారించాల్సిందేనని ఈడీ తరఫున న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు.
మెహతా అభ్యర్థనను చిదంబరం తరఫు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే నేరం కింద సీబీఐ రిమాండ్‌లోకి తీసుకున్నందున... ఈడీకి ఆ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇంకా చిదంబరం రిమాండ్‌కు ఇప్పటికే గరిష్ఠ కాలపరిమితి ముగిసిందని... మళ్లీ అదుపులోకి తీసుకునే అధికారం లేదన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు చిదంబరం. అక్టోబర్ 17 వరకు జ్యుడీషియల్ కస్టడీ పేరిట తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఆగస్టు 21న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. అనంతరం.. సీబీఐ కస్టడీలో గడిపిన ఆయనను ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం తిహార్ జైలుకు తరలించారు.