2019 అక్టోబర్ 2... మహాత్మా గాంధీ 150వ జయంతి. బాపూ మరణించి ఈ ఏడాది జనవరికి 70 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మృత్యువుపై గాంధీజీకి ఉన్న అభిప్రాయాలను చర్చించుకోవడం ఎంతో అవసరం. బాపూ మాట్లాడని, రాయని కోణమంటూ ఏదీ లేదు. మరణాలపైనా అనేక మార్లు విస్త్రతంగా చర్చలు జరిపారు. రాజకీయ జీవితం తొలినాళ్ల నుంచే ధైర్యాన్ని చాటిచెప్పారు గాంధీ. ఈ ధైర్య గుణమే బాపూను ఎన్నో భయాల నుంచి విముక్తం చేసింది. మృత్యువుకు గాంధీ భయపడకపోవడానికి కూడా ఇదే కారణం.
మృత్యువు... ఓ మంచి స్నేహం...
తాను రచించిన "సత్యాగ్రహ్ ఇన్ సౌతాఫ్రికా"లో మరణాలను ప్రస్తావించారు బాపూ. ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ దేవునిపై అపారమైన నమ్మకం ఉండాలని గాంధీ అన్నారు. జీవ-మరణాలకున్న సంబంధాలను వివరించారు. మృత్యువు ఎదురుపడితే.. ఎన్నో ఏళ్ల తర్వాత కలుస్తున్న స్నేహితుడిగా భావించాలని ఉద్బోధించారు. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో.. మృత్యువును గాంధీ స్నేహితునిగా భావించారనడానికి ఇది నిదర్శనం. 1926 డిసెంబర్ 30న ఆయన రాసిన మరో పుస్తకం "యంగ్ ఇండియా"లో 'మరణం ఓ స్నేహం మాత్రమే కాదు.. ఎంతో మంచి తోడు కూడా' అని పేర్కొన్నారు.
గాంధీ దృష్టిలో మృత్యువు ఒక భయానక ఘటన కాదని అర్థమవుతోంది. 'ఏ సమయంలోనైనా మరణం అదృష్టమే' అని ఓ సందర్భంలో గాంధీ అన్నారు. సత్యానికి సంబంధించిన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏ యోధుడైనా మరణిస్తే.. అప్పుడు ఆ అదృష్టం రెండింతలవుతుంది. ఈ సందర్భంలో సత్యం- నిర్భయం కలిసే ఉంటాయి. ఈ రెండింటినీ ఎప్పుడూ వేరుచేయలేము.
నిజాయితీని కాపాడటం కోసం ప్రాణ త్యాగానికైనా గాంధీ సిద్ధంగా ఉండటానికి కారణమిదే. ప్రాణ సమర్పణకు అవకాశాలు తగ్గిపోతున్నాయని గాంధీ గ్రహించినప్పుడల్లా నూతన పరిస్థితులను వెతుక్కునే వారని.. మహాత్ముడి వ్యూహాలను అర్థం చేసుకున్న ఆచార్య జేబీ క్రిప్లాని పేర్కొన్నారు.
1948 జనవరి 30కి ముందే గాంధీని హత్య చేయడానికి అనేక ప్రయత్నాలు జరగడానికి కారణమూ ఇదే. దక్షిణాఫ్రికాలో ఓసారి బాపూను హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది. బ్రిటీష్ మిత్రుడిని రక్షించడమే ఇందుకు కారణం. భారత్‌లో 1934 తర్వాత గాంధీ జీవితం నిత్యం ప్రమాదంలో ఉండేది.
125 ఏళ్లు జీవించాలనుకునే వారు గాంధీ. కానీ 1944 తర్వాత ఎన్నిసార్లు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉనప్పటికీ... సొంత భద్రత గురించి ఆయన ఎన్నడూ ఆలోచించలేదు. మృత్యువు భయంపై ఎన్నో ఏళ్ల ముందే గాంధీ విజయం సాధించారని దీని ద్వారా తెలుస్తోంది. ఈ నిర్భయంతోనే సత్యాన్ని అనేక సమస్యలతో జోడించి.. వాటితో ముందుకు సాగారు. అది హరిజన్ యాత్ర అయినా కావచ్చు... లేదా 1946 తర్వాత కమ్యునిజంపై జరిగిన పోరాటాలైనా కావచ్చు. ఒంటరిగా నడవడానికి గాంధీ ఒక్క నిమిషమూ జంకలేదు.
బంగ్లాదేశ్‌లోని నోవఖాలి గ్రామాల్లో గాంధీ మంచి ప్రజాదారణ పొందిన నాయకుడు కాదు. కానీ హిందువుల ప్రాణాలను రక్షించేందుకు అక్కడ చిన్న బృందంతో ప్రయాణం సాగించేవారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు బాపూను విస్మరించ లేకపోయేవారు. ఆయన చెప్పినవి పాటించకుండా ఉండలేకపోయారు. గాంధీ ప్రభావం వారిపై ఉండటమే ఇందుకు కారణం. ఇది గాంధీని మహాత్ముడిగా చేసింది. జీవ-మరణాలను శాశ్వత సత్యాలుగా అంగీకరించిన మహాత్ముడికి అన్ని రకాల భయాల నుంచి విముక్తి లభించింది.
(రచయిత-సౌరభ్ వాజ్‌పేయీ)