మధ్యప్రదేశ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 70 కిలోల ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్)ను ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దేశంలో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల్లో ఇది ఒకటని వెల్లడించారు.
ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి ఇందోర్‌కు తరలిస్తున్నారని ఇందోర్ అదనపు డీజీపీ యోగేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 13 లక్షలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
"హైదరాబాద్‌లో నివాసం ఉండే వేద్ ప్రకాశ్ వ్యాస్.. డ్రగ్స్ డెలివరీ చేయడానికి తన డ్రైవర్‌తో పాటు ఇందోర్‌కు వచ్చాడు. క్రైమ్ బ్రాంచ్ అదనపు ఎస్పీ గురుప్రసాద్ పరాషార్ వీరి గురించి సమాచారం అందుకున్నారు. వెంటనే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు."
-యోగేశ్ దేశ్‌ముఖ్, ఇందోర్ అదనపు డీజీపీ
ఇందోర్ నుంచి దక్షిణాఫ్రికాకు ఈ మాదకద్రవ్యాలను సరఫరా చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు దేశ్‌ముఖ్ వెల్లడించారు.
డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాస్.. ఇదివరకు ఓ ఫార్మా సంస్థలో పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇందోర్, ఉజ్జయిన్, మంద్‌సౌర్‌లో నివాసం ఉండేవాడని చెప్పారు. ఇటీవలే తెలంగాణలో ఔషధ ఫ్యాక్టరీ నెలకొల్పాడని.. ఎండీఎంఏ డ్రగ్‌ను ఔషధాల తయారీలో ఉపయోగించకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. పోలీసుల చాకచక్యం!