1965, 1971 ఈ ఏడాదులు చూస్తే.. గుర్తొచ్చేది భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధాలు. 2019 కూడా వాటి సరసన చేరబోతోందా? అన్న సందేహాల నుంచి ఆర్టికల్ 370 రద్దు, కుల్‌భూషణ్ జాదవ్ కేసు, కర్తార్‌పుర్ నడవా ప్రారంభం వరకు ఈ ఏడాదిలో భారత్-పాక్ మధ్య సాగిన మైత్రిని ఓసారి చూద్దాం.
మోదీకి ఇమ్రాన్ శాంతి మంత్రం
2018 ఆగస్టులో పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రధానిగా తొలి ప్రసంగంలోనే భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సరిహద్దు సహా ఇతర సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని ప్రధాని మోదీకి స్నేహహస్తం అందించారు.
ముంచుకొచ్చిన యుద్ధమేఘాలు
ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగుపడొచ్చని అందరూ భావించారు. అయితే 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏకంగా 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థానీ ఉగ్ర సంస్థ దుశ్చర్యతో యావత్ భారతం రగిలిపోయింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద తేడా లేకుండా భారతీయులంతా ప్రభుత్వాన్ని కోరారు.
భారత్ ప్రతీకారం
సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నందున మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన దళాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి.. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మన జవాన్లను బలిగొన్న వారి ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశాయి. 1971 యుద్ధం తరువాత పాక్ భూభాగంలోకి భారత వాయుసేన విమానాలు ప్రవేశించడం ఇదే తొలిసారి.
యుద్ధ మేఘాలు
ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 27న భారత్-పాక్ దేశాల వాయుసేనల మధ్య గగనతలంలో చిన్నపాటి యుద్ధం జరిగింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ జెట్లను తరిమికొట్టే సమయంలో అనూహ్య రీతిలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విమానం పాక్ భూభాగంలో నేలకూలింది. గాయాల పాలైన వర్ధమాన్‌ను పాక్ సైనికులు బంధించారు.
భారత సైనికుడిని పాక్ సేనలు బంధించినందున పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్-పాక్ వైపుకేసి చూసిన తరుణంలో.. దాయాది దేశాల మధ్య మరోమారు యుద్ధం తప్పదా? అన్న సందేహాలు చెలరేగాయి. అయితే అదే సమయంలో వర్ధమాన్ అభినందన్‌ను భారత్‌కు తిరిగి అప్పగిస్తామని పాక్ ప్రకటన చేసినందున.. యుద్ధ మేఘాలు కాస్త చల్లబడ్డాయి.
కర్తార్‌పుర్ చర్చలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కర్తార్‌పుర్ నడవా నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్నికల హామీలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టులో రద్దు చేసింది మోదీ సర్కారు.
ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో పాక్ మరోమారు గుర్రుమంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని తెగేసి చెప్పింది. పాక్‌లోని భారత హై కమిషనర్‌ను బహిష్కరించింది. భారత్‌తో విమాన, రైల్వే, రోడ్డు మార్గాల సేవలను నిలిపివేసింది. ఈ పరిణామాల నడుమ కర్తార్‌పుర్ నడవా నిర్మాణం ఓ ప్రశ్నార్థకంగా మిగిలింది. కానీ, ఈ సందేహాలకు చెక్ పెడుతూ అనుకున్న విధంగానే గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నవంబరులో కర్తార్‌పుర్ నడవాను ఇరుదేశాలు వేర్వేరుగా ప్రారంభించాయి.
మరోమారు పాక్ వ్యతిరేక గళం
ఇటీవల పౌరసత్వ చట్టానికి మోదీ ప్రభుత్వం అంగీకారం తెలపడంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దక్షిణాసియాలో శరణార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందంటూ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇదే ఏడాదిలోనే కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు సాక్షిగా భారత్ దౌత్యపరమైన విజయం సాధించింది. ఇలా 2019వ ఏడాదిలో భారత్-పాకిస్థాన్ దేశాల మైత్రి ఓసారి బలపడుతూ ఇంకోసారి క్షీణిస్తూ ఎవరి అంచనాలకు అందకుండా సాగింది.
ఇదీ చూడండి : తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?