ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను క్షణాల్లో నిర్ధరించే నూతన సాంకేతిక పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ర్యాపిడ్ టెస్టుల ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నారు. అయితే, తాజాగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం నిమిషంలోపే వైరస్‌ను నిర్ధరించవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. భారత్-ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి రూపొందించిన ఈ నూతన విధానం ప్రయోగాల్లో తుది దశకు చేరుకుంది. ఈ ర్యాపిడ్ టెస్ట్ విధానం సఫలీకృతమై మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుందని ఇజ్రాయిల్ విదేశాంగశాఖ ప్రకటించింది.
'సంయుక్తంగా'
'కరోనా వైరస్‌ను అత్యంత వేగంగా గుర్తించేందుకు ఇప్పటికే భారత్-ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కలిసి పరిశోధన జరిపారు. బ్రీత్ అనలైజర్‌తో పాటు వాయిస్ టెస్ట్ వంటి నాలుగు విభిన్న పరిజ్ఞానాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటి ద్వారా వేల శాంపిళ్లను పరీక్షించి ఫలితాలను విశ్లేషించారు. ఇందులో కచ్చితంగా ఫలితమిచ్చే ఓ విధానం రానున్న రెండు, మూడు వారాల్లోనే ఖరారు కానుంది' అని ఇజ్రాయిల్ రాయబారి రాన్ మాల్కా వెల్లడించారు. వీటితోపాటు లాలాజలంలో కరోనా వైరస్‌ను గుర్తించే ఐసోథర్మల్ టెస్టింగ్‌పై కూడా పరిశోధన జరిపామన్నారు. ఇప్పటికే తుది దశ ప్రయోగాల్లో అన్ని విభాగాల్లో విజయవంతమైనందున త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రాన్ మాల్కా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ నూతన విధానం కొవిడ్ టెస్టుల్లోనే గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందన్నారు.
30-40 సెకన్లలోనే
'ఓపెన్ స్కై' పేరుతో పిలిచే ఈ పరిజ్ఞానం ద్వారా ఎయిర్‌పోర్టులు, ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ట్యూబ్‌లో వ్యక్తి ఊదాల్సి ఉంటుంది. తద్వారా కేవలం 30 నుంచి 50 సెకన్లలోనే కరోనా ఫలితం వస్తుంది. అత్యంత వేగంగా వైరస్‌ను గుర్తించగలిగే ఈ విధానం అందుబాటులోకి రావడం ప్రపంచం మొత్తానికి శుభవార్త’ అని ఆయన అభిప్రాయపడ్డారు. సమయంతోపాటు చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే ఈ ర్యాపిడ్ టెస్టు చేయడం సాధ్యపడుతుందని రాన్ మాల్కా పేర్కొన్నారు.
9 రోజుల్లో 25 వేల శాంపిళ్లు
భారత్‌లోని డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌తో ఇజ్రాయిల్ రక్షణశాఖకు చెందిన డీఆర్‌డీడీ కలిసి సంయుక్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ పరిశోధన చేపట్టాయి. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల్లో దాదాపు 25వేల శాంపిళ్లను పరీక్షించినట్లు ఇజ్రాయిల్ రాయబారి వెల్లడించారు. ఒకవేళ ఈ ర్యాపిడ్ పరీక్షలు మెరుగైన ఫలితాలనిస్తే, వీటి కిట్లను కూడా భారత్‌లోనే తయారు చేసే అవకాశాలున్నాయన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్‌తోపాటు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ రానున్న రోజుల్లో భారత్‌తో కలిసి పనిచేస్తామని ఇజ్రాయిల్ రాయబారి రాన్ మాల్కా స్పష్టంచేశారు.
ఇదీ చదవండి:కేరళ, తమిళనాట కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి