కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పదేపదే కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు దీటైన సమాధానం ఇచ్చినట్లు భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి. రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులను కోలుకోలేని దెబ్బతీసినట్లు వెల్లడించాయి.
పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల ప్రజలను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే వీటిని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉన్నాయి.
ఓ జవాన్ మృతి
బుధవారం రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య... సరిహద్దుల్లో పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని నౌషెరా, బాలాకోట్ సెక్టార్లలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి గ్రామాలు, సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్లను ప్రయోగించారు.
ఈ ఘటనలో భారత జవాను మృతి చెందాడు. ఓ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని పశువులు కూడా మృతి చెందాయి.
కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులను భారత సైన్యం హతమారుస్తుండగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండడం గమనార్హం.
ఇదీ చూడండి: ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు