దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ వారం ముగిసే సరికి భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 10లక్షలకు పైనే ఉంటుందని ట్వీట్ చేశారు. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణ స్థితి నెలకొంటుందని డబ్ల్యూహెచ్ఓ సారథి టెడ్రోస్ అధనోమ్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్‌కు జత చేశారు రాహుల్.
అధనోమ్ ఏమన్నారు?
కొన్ని ప్రభుత్వాలు కరోనా వైరస్‌కు సంబంధించి ప్రజలకు మిశ్రమ సందేశాలను పంపుతున్నాయని సోమవారం ఆరోపించారు అధనోమ్. కరోనా కట్టడిలో విఫలమైన నాయకుల కారణంగా సమీప భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉండవని హెచ్చరించారు.
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 8 లక్షల కేసుల నుంచి 3 రోజుల వ్యవధిలోనే 9 లక్షల మార్కును అధిగమించింది. మొత్తం మరణాల సంఖ్య 23వేల 727కి పెరిగింది.
దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్రాన్ని సోమవారం ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టనందు వల్లే కేసులు పెరుగుతున్నాయని విమర్శించారు.
ఇదీ చూడండి: మరోసారి రాజస్థాన్ సీఎల్పీ భేటీ.. కొలిక్కిరాని బుజ్జగింపులు