తూర్పు లద్దాక్ గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైనికుల త్యాగాలను స్మరిస్తూ ముఖ్యమంత్రులతో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించారు.
రెచ్చగొట్టారో జాగ్రత్త!
కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశమైన ప్రధాని... భారత్- చైనా సరిహద్దు వివాదంపై కూడా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని.. రెచ్చగొడితే మాత్రం దీటైన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు.
"మన జవాన్ల ప్రాణత్యాగం వృథా కానివ్వమని దేశానికి నేను భరోసా ఇస్తున్నాను. భారత్ ఐక్యత, సార్వభౌమత్వం మాకు ముఖ్యం. వీటిని రక్షించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భ్రమలు, సందేహాలు అక్కరలేదు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ రెచ్చగొడితే మాత్రం దీటైన బదులివ్వడానికి తగిన సామర్థ్యం భారత్కు ఉంది."
- ప్రధాని మోదీ
భారతదేశం ఎల్లప్పుడూ ఇరుగుపొరుగు దేశాలకు సహకరిస్తూ, స్నేహపూర్వకంగా కలిసి పనిచేసిందని ప్రధాని గుర్తు చేశారు. పొరుగు దేశాల అభివృద్ధిని, క్షేమాన్ని కాంక్షించిందని స్పష్టం చేశారు. విభేదాలు వచ్చినప్పుడెల్లా, అవి వివాదాలుగా మారకుండా ఉండేందుకు భారత్ కృషి చేసిందని వెల్లడించారు.
ఇదీ చూడండి: చైనా బరి తెగింపు- గాల్వన్ లోయ తమదేనని ప్రకటన