చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్‌కు రానున్న రఫేల్ యుద్ధవిమానాలకు మరింత సామర్థ్యం చేకూర్చే దిశగా వైమానిక దళం అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్ నుంచి హ్యామర్ క్షిపణులను దిగుమతి చేసుకొని రఫేల్ యుద్ధవిమానాలకు జోడించాలని భావిస్తోంది. ఆయుధ పరికరాలను దిగుమతి చేసుకొనేందుకు మోదీ సర్కారు రక్షణ రంగానికి ఇచ్చిన ఆర్థిక అధికారాల కింద వీటిని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం.
"హ్యామర్ క్షిపణులను కొనుగోలు కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తయింది. క్షిపణులను అందించేందుకు ఫ్రాన్స్ అధికార యంత్రాంగం అంగీకరించింది."
-భారత అధికారులు
అత్యవసరంగా కావాలని భారత్ కోరిన నేపథ్యంలో ఇతర వినియోగదారుల కోసం ఉంచిన క్షిపణులను ఫ్రెంచ్ వర్గాలు వైమానిక దళానికి సరఫరా చేయనున్నట్లు సమాచారం. గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణులు, 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి లక్ష్యాన్నైనా చేధించగలుగుతాయి.
తూర్పు లద్ధాఖ్ వంటి క్లిష్టతరమైన భూభాగంలో ఉండే బంకర్లు, స్థావరాలను ధ్వంసం చేసేలా వీటి నిర్మాణం ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 29న ఐదు రఫేల్ విమానాలు భారత్‌కు రానున్నాయి.
ఇదీ చూడండి: 'మోదీజీ... అలా చేస్తేనే చైనా దూకుడుకు కళ్లెం'