దేశ శక్తిసామర్థ్యాలు, విస్తీర్ణం పరంగా భారత్.. చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. చైనా విస్తరణవాద ధోరణి గురించి యావత్ ప్రపంచానికి తెలుసని అన్నారు.
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మహర్షి వ్యాస ఆడిటోరియంలో జరిగిన.. ఆర్ఎస్ఎస్ వార్షిక విజయదశమి కార్యక్రమంలో పాల్గొన్నారు భాగవత్. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది కేవలం 50 మంది స్వయంసేవక్లతోనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా భారత్ మెరుగ్గా సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
"ప్రస్తుతం చాలా దేశాలు చైనాకు మద్దతుగా నిలుస్తున్నాయి. చొరబాట్లకు ప్రయత్నించిన క్రమంలో భారత్ ప్రతిస్పందనతో చైనా కలవరపాటుకు గురైంది. శక్తిసామర్థ్యాలు, విస్తీర్ణం పరంగా చైనా కంటే భారత్ పెద్దదిగా ఎదగాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి సమయంలో మన భూభాగాన్ని చైనా ఆక్రమించింది. చైనా విస్తరణవాదం ప్రపంచానికి తెలుసు. అందుకు తైవాన్, వియత్నాంలే ఉదాహరణ. అందరితో స్నేహంగా ఉండాలనేది భారత్ స్వభావం. మన బలహీనతను ఆసరాగా చేసుకుని.. దేశాన్ని సైనిక శక్తితో బలహీన పరచాలనుకోవటాన్ని సహించం. మా విరోధులు ఈ విషయం తెలుసుకోవాలి."
- మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్
సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఏ ఒక్క ప్రత్యేక మతానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు భాగవత్. వారి జనాభాను పరిమితం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని.. కొందరు మన ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సీఏఏ ద్వారా ఏ ఒక్క భారతీయ పౌరుడికి అన్యాయం జరగదన్నారు. అయితే.. దీని ద్వారా ఎదురైన సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టే క్రమంలోనే కరోనా వచ్చి.. అన్ని అంశాలను పక్కకు నెట్టిందని చెప్పారు.
దేశం మొత్తం అంగీకరించింది..
ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయటం, రామమందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పును దేశం మొత్తం అంగీకరించిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. గతేడాది దసరా ముందు నుంచి ఇప్పటివరకు సంవత్సర కాలంలో.. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరానికి భూమి పూజ, సీఏఏ చట్టం వంటి పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
కరోనాతో ఆందోళన వద్దు..
కరోనా వైరస్‌తో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు భాగవత్. కానీ, నిరంతరం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాపిస్తున్నా.. మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా పరిశుభ్రత, పర్యావరణం, కుటుంబ విలువలు వంటి వాటి గురించి మరోమారు తెలుసుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. కరోనాతో నిరుద్యోగ సమస్య పెరిగిందని, ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు కల్పించటమే అతిపెద్ద సవాలుగా మారినట్లు చెప్పారు మోహన్ భాగవత్.
ఇదీ చూడండి: నేపాల్‌నూ వదలని చైనా- సరిహద్దులో దురాక్రమణలు
'భారత సైన్యం ఉండగా.. అంగుళం కూడా ఆక్రమించుకోలేరు'