చైనా మాటలకు, చేతలకు పొంతన లేదని ఆధారాలతో సహా తాజాగా రుజువైంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో డ్రాగన్ 423 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో 1960లో తానే స్వయంగా పేర్కొన్న సరిహద్దు (క్లెయిమ్ లైన్)ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ నెల 25న 'ఎన్‌డీటీవీ' సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌కు చెందిన 423 మీటర్ల భూభాగంలో చైనా సైన్యం 16 గుడారాలు, టార్పాలిన్లు, ఒక భారీ షెల్టర్‌ను ఏర్పాటు చేసింది.
1960లో సరిహద్దు రేఖకు సంబంధించి తన వాదనను చైనా వినిపించింది. తన దృష్టిలో సరిహద్దు ఎలా వెళుతుందన్న దానిపై రేఖాంశ, అక్షాంశ వివరాలను అందించింది. 'రిపోర్ట్ ఆఫ్ ద గవర్న్‌మెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆన్ ద బౌండరీ క్వెశ్చన్'లో ఇవి ఉన్నాయి. నాడు రెండు పక్షాల మధ్య జరిగిన చర్చల్లో భారత అధికారులు అడిగిన ప్రశ్నలకు చైనా బృందం ఇచ్చిన సమాధానాలను అందులో పొందుపరిచారు. గల్వాన్ నది వద్ద సరిహద్దు ప్రస్తావన కూడా ఉంది. "రెండు పర్వతాల గుండా వెళుతున్న సరిహద్దు రేఖ.. పర్వత పంక్తికి దక్షిణం గుండా పయనిస్తుంది. ఆ తర్వాత అది గల్వాన్ నది వద్ద 780 13। తూర్పు రేఖాంశం, 340 46। ఉత్తర అక్షాంశం గుండా వెళుతుంది." అని చైనా పేర్కొంది.
'గూగుల్ ఎర్త్ ప్రొ'పై ఈ రేఖాంశ, అక్షాంశ వివరాలను పరిశీలించినప్పుడు చైనా చెబుతున్న రేఖ.. గల్వాన్ లోయలో ఉన్నట్లు స్పష్టమైంది. దీనికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలన్నీ భారత్‌వే. అయితే తాజా ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే స్వీయ సరిహద్దు రేఖను ఉల్లంఘించి, 423 మీటర్ల మేర భారత భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించినట్లు అర్థమవుతోంది.
1962 నాటి యుద్ధ సమయంలో చైనా బలగాలు.. గల్వాన్ ప్రాంతంలో భారత సైన్యంతో తీవ్ర పోరు తర్వాత తమ క్లెయిమ్ రేఖ వద్దకు వచ్చాయి. అనంతరం ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి వెనుదిరిగాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల బలగాలు అక్కడ పెద్దగా గస్తీ నిర్వహించలేదు.
గల్వాన్‌లో ఇప్పుడు చైనా నిర్మాణ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే ఉద్దేశం ఆ దేశ సైన్యంలో ఉన్నట్లు కనిపించడంలేదు. గల్వాన్ నదిలో కల్వర్టులను నిర్మిస్తోంది.
నిఘా పెంచిన భారత నౌకా దళం
చైనా సరిహద్దుల్లో పరిస్థితుల దృష్ట్యా హిందూ మహాసముద్రంలో భారత నౌకా దళం తన మోహరింపులను ముమ్మరం చేసింది. మిత్ర దేశాలైన అమెరికా, జపాన్ నౌకాదళాలతో సహకారాన్ని మరింత పెంచింది. శనివారం భారత్, జపాన్ యుద్ధనౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే చైనా యుద్ధనౌకల కదలికలు పెరిగాయి.
నేడు భారత్-చైనాల మూడో విడత చర్చలు
సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, బలగాలను ఉపసంహరణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించుకోవడానికి భారత్, చైనా సైనికాధికారులు మంగళవారం మరోసారి సమావేశం కానున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్ సెక్టార్‌లో భారత భూభాగంలో ఈ భేటీ జరుగుతుంది. భారత పక్షానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ జిల్లా కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నాయకత్వం వహిస్తారు. ఈ అధికారులిద్దరి మధ్య ఇప్పటికే రెండు విడతలు చర్చలు జరిగాయి.
కేంద్ర నాయకత్వ పరిధిలోకి చైనా రిజర్వు బలగాలు
చైనా సైనిక రిజర్వు దళాలు ఇక చైనా కమ్యూనిస్టు పార్టీ, కేంద్ర సైనిక కమిషన్ ఆధ్వర్యంలోని ఏకీకృత కమాండ్ పరిధిలోకి వస్తాయి. ఈ రెండింటికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నాయకత్వం వహిస్తున్నారు. సైన్యంపై అధికార పార్టీ పూర్తి పట్టు ఉండటంతోపాటు ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించడం కోసం ఈ చర్యను చేపట్టారు.
ఇదీ చూడండి: డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్‌లపై నిషేధం