యావత్ దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులిచ్చింది. రెండు టీకాలను షరతులతో అత్యవసరంగా వినియోగించేందుకు ఆమోదం తెలిపింది. తద్వారా దేశ ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర అనుమతి ఇచ్చినట్లు డీసీజీఐ డైరెక్టర్ వీడీ సోమాని ఆదివారం ఉదయం వెల్లడించారు.
సీరం, భారత్ బయోటెక్ టీకాలను 2-8 డిగ్రీల సెల్సియస్ సాధారణ ఉష్ణోగ్రతలో నిల్వ చేయవచ్చు. ఒక్కొక్కరికి రెండు డోసుల్లో టీకాను ఇవ్వాల్సి ఉంటుంది.
కొవిషీల్డ్ టీకాను ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం, ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేెశాయి. కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్‌తో కలిసి తయారు చేసింది. రెండూ స్వదేశంలో తయారైనవే.
23వేల 754మందిపై ప్రయోగం..
కొవిషీల్డ్ టీకా సురక్షితం అని తెలిపేందుకు సీరం సంస్థ 23వేల 745మందిపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ వివరాలను సమర్పించిందని సోమాని తెలిపారు. వీరంతా విదేశాలకు చెందిన 18 ఏళ్లు పైడిన వయస్కుల వారని పేర్కొన్నారు. మొత్తంగా కొవిషీల్డ్ టీకా 70.42శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించామని వివరించారు.
ప్రస్తుతం దేశంలో 1600మందిపై కొవిషీల్డ్ టీకా 2/3 దశ ప్రయోగాలు జరుగుతున్నట్లు సోమాని చెప్పారు. వీటికి సంబంధించిన వివరాలను కూడా సంస్థ సమర్పించిందని, ఇతర దేశాల్లో జరిపిన ప్రయోగాలతో పోల్చితే ఇవి సరితూగాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ ప్రయోగాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
ఇదీ చూడండి: ఆక్స్ఫర్డ్ టీకా 'కొవిషీల్డ్' ప్రత్యేకతలివే...
కొవాగ్జిన్ సురక్షితం..
భారత్ బయోటక్, ఐసీఎంఆర్, పుణె ఎన్ఐవీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా సురక్షితమని సోమాని అన్నారు. గతంలో విజయంతమైన టీకాలు అభివిద్ధి చేసిన ఘనత ఆ సంస్థకు ఉందని పేర్కొన్నారు. మొదటి, రెండో దశ ప్రయోగాల్లో టీకా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తున్నట్లు తేలిందని వివరించారు. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా ఇప్పటివరకు 25వేల 800 వలంటీర్లను సంస్థ నియమించుకున్నట్లు చెప్పారు. 22,500 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక ఫలితాల్లో టీకా సురక్షితమేనని గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కొత్త వైరస్‌పైనా 'కొవాగ్జిన్' టీకా పని చేస్తుంది!
ప్రధాని మోదీ హర్షం..
సీరం, భారత్ బయోటెక్ టీకాలకు అనుమతులు రావడం కరోనాపై పోరులో నిర్ణయాత్మక మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యవంత, కరోనా రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం ద్వారా మార్గం సుగమమవుతుందని ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోరంగా శ్రమిస్తోన్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు చెప్పారు మోదీ.
" స్వదేశంలో తయారు చేసిన రెండు టీకాలకు అనుమతి లభించడం ప్రతి భారతీయునికి గర్వకారణం. ఆత్మనిర్బర్ భారత్ కలను సాకారం చేసేందుకు మన శాస్త్రీయ రంగం ఎంత ఆత్రుతగా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం."
-ప్రధాని మోదీ ట్వీట్.
వైరస్‌పై పోరులో దేశాన్ని ముందుండి నడిపిస్తున్న కరోనా యోధులకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
స్వాగతించిన డబ్ల్యూహెచ్ఓ
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు భారత్‌లో అత్యవసర అనుమతి లభించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై పోరును తీవ్రతరం చేసి మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని డబ్లూహెచ్ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రజలకు టీకా అందిండమే కాకుండా, ఆరోగ్య జాగ్రత్తలు పాటించేలా చూడటమూ ఎంతో కీలకమన్నారు.
కొన్ని వారాల్లో..
కొవిషీల్డ్ టీకాకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించటంపై సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. వారాల వ్యవధిలోనే టీకాలను విడుదల చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కొవిషీల్డ్ అన్ని అంచెలను దాటిందన్నారు. సురక్షితమైన, సమర్థత కలిగిన టీకాను త్వరలోనే తీసుకురానున్నట్లు చెప్పారు. దేశంలో అనుమతి లభించిన తొలి టీకా తమదేన్నారు.
గర్వకారణం..
కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుతివ్వడంపై భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా హర్షం వ్యక్తం చేశారు. దేశం గర్వపడే సందర్భమిదని పేర్కొన్నారు. భారత శాస్త్రీయ సామర్థ్యానికి ఇది గొప్ప మైలురాయి అని ప్రకటనలో తెలిపారు.