భారత్-చైనా తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ నుంచి బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాయని భారత సైన్యం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరు దేశాలు సైనిక, దౌత్య చర్చలు ద్వారా వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
వాస్తవాధీనరేఖ వెంబడి భారత్ వైపున్న చుషుల్‌లో జులై 14న (నాల్గవసారి) భారత్-చైనా సైనిక కమాండర్ల స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున మేజర్ జనరల్ లియూ లిన్ ప్రాతినిధ్యం వహించారు.
"చుషుల్ సమావేశంలో భారత్-చైనా కమాండర్లు.. గల్వాన్ లోయ నుంచి ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ అమలు పురోగతిపై సమీక్షించారు. పూర్తి బలగాల ఉపసంహరణకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనా చర్చించారు."
- భారత సైన్యం అధికార ప్రతినిధి
'వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిగా తమతమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్-చైనా నిర్ణయించాయి. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. అందువల్ల బలగాల ఈ ప్రక్రియను ప్రతి క్షణం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది' అని భారత సైన్యం అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
డోభాల్ ఎంట్రీతో మారిన సీన్ !
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ జులై 5న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో టెలిఫోన్ చర్చలు జరిపారు. దీని తరువాత చైనా తన సైనిక బలగాలను లద్దాఖ్ నుంచి ఉపసంహరించడానికి అంగీకరించి, అమలు చేస్తోంది.
ఇదీ చూడండి: 'చైనా యాప్‌ల బ్యాన్పై త్వరలోనే నిర్ణయం'