పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం ఫలితంగా దేశంలో ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అదే సమయంలో అధిక ఇంధన వాడకంవల్ల కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంధన వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. హానికర కర్బన ఉద్గారాలతో కాలుష్య సమస్య తీవ్రతరమవుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
దేశీయంగా ఇంధన వనరుల కొరత కారణంగా ముడిచమురు, బొగ్గు కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తోంది. ఫలితంగా పెద్దయెత్తున విదేశ మారక ద్రవ్యాన్ని దేశం కోల్పోవలసి వస్తోంది. వంద యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే సుమారు 50 నుంచి 60 కిలోల బొగ్గు మండించాలి. దేశవ్యాప్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 62.90 కోట్ల టన్నుల బొగ్గు మండించారు. ఫలితంగా భారీగా హానికర కర్బన ఉద్గారాలతో వాతావరణం కలుషితమైంది. దీన్ని నివారించాలంటే బొగ్గు వినియోగాన్ని బాగా తగ్గించాలి. అదే సమయంలో పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో సౌర, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికయ్యే వ్యయం తక్కువే. విద్యుత్ ధర కూడా తక్కువే. యూనిట్ సుమారు మూడు రూపాయలకు లభిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే సౌర, పవన విద్యుత్ విషయంలో భారత్ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. కిలోవాట్ సౌర ఫలకాలు నెలకొల్పాలంటే, సుమారు 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. అధిక విద్యుత్ వినియోగించే నగరాలు, పట్టణాల్లో భూమి కొరత అధిగమించేందుకు భవనాల పైకప్పులపై చిన్న సౌర ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాలి. సౌర ఫలకాల ఖరీదు కిలోవాటుకు రూ.52,000 ఉండగా, దీనిపై గృహ వినియోగదారులకు ప్రభుత్వం మూడు కిలోవాట్ల వరకు 40 శాతం, మూడు నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం చొప్పున రాయితీ ఇస్తోంది.
ఆశాకిరణంలా సౌరవిద్యత్...
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3.8 కోట్ల భవనాల్లో కనీసం 20 శాతం భవనాలపైన అయినా సౌర విద్యుత్ ఫలకాలు నెలకొల్పితే దాదాపు 124 గిగావాట్ల ఉత్పత్తి సాధించవచ్చని అంచనా. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 కల్లా పైకప్పు సౌర ప్రాజెక్టుల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 గిగావాట్లకు పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. దీన్ని చేరుకోవాలంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. అదే సమయంలో ఆ మేరకు నిపుణులను తయారు చేసుకోవాల్సిన అవసరముంది. గ్రామాల్లో ఎందుకూ పనికిరాని బీడు భూముల్లో సౌర విద్యుదుత్పత్తికి రైతులను ప్రోత్సహించాలి. ఆ విద్యుత్తును సమీపంలోని రైతుల భూములకు సరఫరా చేయవచ్ఛు తద్వారా సరఫరా ఖర్చు తగ్గించవచ్ఛు హైదరాబాద్ రాజ్‌భవన్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాల పైకప్పులపై సౌరవిద్యుత్ ఉత్పాదక కేంద్రాలు (రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లు) ఏర్పాటు చేశారు. భారతదేశం సమశీతోష్ణ మండలం కావడం వల్ల, సంవత్సర పొడగునా సూర్యరశ్మి సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల సౌర విద్యుత్తును నిరాటంకంగా ఉత్పత్తి చేయవచ్ఛు గాలిమరలతో పవన విద్యుత్ ఉత్పత్తి పెంచవచ్ఛు కాలాన్ని బట్టి గాలివాటం మారడంవల్ల స్థిరమైన ఉత్పత్తిని అంచనా వేయలేం. దీనివల్ల అవసరాలు, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగే ప్రమాదముంది.
ఒకవైపు పునరుత్పాదక విద్యుత్తును పెంచుతూ, మరోవైపు నాణ్యమైన పరికరాలు వినియోగించడం, ఉత్తమ పద్ధతులు పాటించడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టవచ్ఛు ఒక యూనిట్ వినియోగం తగ్గించినా, వృథాను నివారించినా- ఆ మేరకు ఉత్పత్తి చేసినట్లే! ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. 2001లో ఇంధన పొదుపు చట్టం తీసుకువచ్చింది. స్టీలు, సిమెంట్, రైల్వే, టెక్స్‌టైల్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ సరఫరా సంస్థలను చట్ట పరిధిలోకి తెచ్చింది. చట్ట ప్రకారం ఈ పరిశ్రమలు ఏటా ఇంధన వినియోగ తనిఖీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కువ ఇంధనం వినియోగించినట్లయితే అపరాధ రుసుం చెల్లించాలి. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) అనే సంస్థను ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించే భవనాలకు, ఇంధన వినియోగ పరిమితులు పేర్కొంటూ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)ను తీసుకువచ్చారు. కొత్త భవనాల నిర్మాణానికి కొన్ని నిబంధనలను నిర్దేశించారు. నూతనంగా నిర్మించే పెద్ద వైద్యశాలలు, సమావేశ మందిరాలు, బహుళ అంతస్తుల సినిమా హాళ్లకు ఈ చట్టం వర్తింపజేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి...
పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. భారత్‌లో ఇప్పటికే పెద్దయెత్తున వివిధ రకాల వాహనాలు తిరుగుతున్నాయి. వీటికితోడు రోజూ సుమారు లక్షకు పైగా కొత్త వాహనాలు అదనంగా వచ్చి చేరుతున్నట్లు అంచనా. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే రాబోయే రోజుల్లో వాతావరణ కాలుష్య సమస్య మరింత తీవ్రమవుతుంది. దీన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా విద్యుత్ లేదా హైడ్రోజన్ వాహనాలు వాడవలసి ఉంటుంది. వీటివల్ల కాలుష్యం, ఇంధన వాడకాన్ని తగ్గించవచ్ఛు తద్వారా పెద్దమొత్తంలో విదేశ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్ఛు ఈ విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీి ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. విద్యుత్ వాహనాలు, డీజిల్, పెట్రోల్ ధరలు అధికంగా ఉండటం, తగినన్ని విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, ఒకసారి ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోవడం, ఛార్జింగ్‌కు అధిక సమయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణాలు. విద్యుత్ వాహనాల వాడకంతో కాలుష్యాన్ని నియంత్రించవచ్ఛు వీటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు విద్యుత్ వాహనాలకు సంబంధించిన విధానాన్ని ప్రకటించి, ప్రజా రవాణా సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలి. ప్రభుత్వాలు ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కార మార్గాలు కనుగొన్నప్పుడే 2030 నాటికి 50 శాతం విద్యుత్ వాహనాలు నడపాలన్న లక్ష్యం నెరవేరగలదు.
అవగాహన పెంచాలి
విద్యుత్ నాణ్యత, వినియోగం గురించి తెలుసుకొనేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. వినియోగదారులకు‘ఉజాల’ కార్యక్రమం ద్వారా సుమారు 36.1 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను, 23.1 లక్షల అత్యధిక సామర్థ్యం గల ఫ్యాన్లను, 71.61 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లను కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరలకు ప్రజలకు సరఫరా చేసింది. తద్వారా విద్యుత్తును ఆదా చేసింది. కర్బన ఉద్గారాలు వెలువడకుండా నివారించి కాలుష్య నివారణకు దోహదపడింది. దేశవ్యాప్తంగా సుమారు 1,050 పురపాలక సంఘాల్లో వీధి దీపాలను ఎల్‌ఈడీలోకి మార్చింది.
సౌర విద్యుత్ కేంద్రాలను పెద్దయెత్తున నెలకొల్పాల్సిన అవసరం ఉంది. నగరాలు, పట్టణాల్లో భవనాలపై వీటి ఏర్పాటును ప్రోత్సహించాలి. దీనివల్ల విద్యుత్ సరఫరా నష్టాలను నివారించవచ్ఛు వ్యవసాయ అననుకూల భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఫలకాలను నెలకొల్పాలి. ఈ విద్యుత్తును దగ్గరలో ఉన్న మరో వినియోగదారుడికి సరఫరా చేసి, ఆదాయం పొందవచ్ఛు పవన విద్యుదుత్పత్తినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న సుమారు 2.1 కోట్ల వ్యవసాయ పంపులను మార్చి, వాటి స్థానంలో మంచి సామర్థ్యం గల పంపులను అమర్చినట్లయితే విద్యుత్తును ఆదా చేయవచ్ఛు తద్వారా కర్బన ఉద్గారాలను నివారించవచ్ఛు విద్యుత్ వాహనాల వినియోగం పెంచే విధానాలను రూపొందించాలి. పాఠశాల, కళాశాలల స్థాయుల్లో ఇంధన పొదుపును పాఠ్యాంశంగా చేర్చాలి. దీనివల్ల విద్యార్థులకు బాల్యం నుంచే ఇంధన ప్రాధాన్యంపై అవగాహన ఏర్పడుతుంది. ఇంధన పొదుపుపై ప్రజల్లోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఓ బాధ్యతగా భావించాలి!
-ఇనుగుర్తి శ్రీనివాసాచారి
(రచయిత- విద్యుత్ రంగ నిపుణులు)