అతివల మదిని దోచే వర్ణరంజితమైన చీరల్లో వైవిధ్యాలు..వింతలు..విశేషాలు ఎన్నెన్నో!! వేడుకలు, వినోదాలు, పండగలు..ఇలా సందర్భం ఏదైనా వాటి ముచ్చటే వేరు! ఈ విషయాలను అలా ఉంచితే మధ్యప్రదేశ్ చేనేత కళాకారులు ఓ అద్భుతం సృష్టించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో సొగసరి చీరలకు అదనపు సొబగులను అద్దారు. ఔషధగుణాలను పొదువుతూ తీర్చిదిద్దిన ఆ చీరలను ధరిస్తే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయట. సుగంధ భరితమై ఈ ఔషధ చీరలు దేశంలోని పలు ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు
యాలకలు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, వాము, బిర్యానీ ఆకు, వివిధ రకాల పుష్పాలు తదితరాలు.
ఆయుర్వేద వైద్యుల ప్రశంసలు
ఔషధ చీరలు ధరించినవారి చర్మం ద్వారా వ్యాధినిరోధక శక్తి అందుతుందని ఆయుర్వేద నిపుణులు అంగీకరిస్తున్నారు. ఆయుర్వేదంలోని ప్రత్యేక ఔషధ గుణాలు ఈ చీరల్లో స్పష్టమవుతున్నాయని, ఆరోగ్య రక్షణకు ఇవి దోహదపడతాయని భోపాల్‌లోని పండిత్ కుషి లాల్ శర్మ ఆయుర్వేద కళాశాల విభాగాధిపతి డాక్టర్ నితిన్ మార్వా తెలిపారు.
ఏమిటి ప్రత్యేకత?
మధ్యప్రదేశ్ చేనేతలు, హస్తకళల డైరెక్టరేట్ అధికారుల సలహాతో చేనేత కార్మికులు ఔషధ చీరలను రూపొందించారు. వందల ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానం ఆధారంగా సాధారణ చేనేత చీరకు పలు దశల్లో ఆయుర్వేద గుణాలను పొందుపరుచుతారు. సుగంధ మూలికలను 48 గంటల పాటు నీటిలో నానబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకూ దశలవారీగా పట్టిస్తారు. ప్రత్యేక నైపుణ్యంతో అత్యంత జాగ్రత్తగా చేసే ఈ ప్రక్రియలో ఒక్కో చీర తయారీకి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది.
మధ్యప్రదేశ్‌లో విక్రయాలు..
భోపాల్‌లో తయారు చేస్తున్న ఈ ఔషధ వస్త్రాలను భోపాల్, ఇండోర్‌లతో పాటు గ్వాలియర్, ఖజురహో, పాచ్‌మడి, జబల్‌పుర్, సాంచి, మహేశ్వర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విక్రయిస్తున్నారు.
త్వరలో హైదరాబాద్‌లోనూ..
దేశవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఔషధ వస్త్రాలను విక్రయించనున్నట్లు మధ్యప్రదేశ్ చేనేత, హస్తకళల అభివృద్ధి సంస్థ కమిషనర్ రాజీవ్ శర్మ వెల్లడించారు. మృగనయని ఎంపోరియంల పేరుతో వీటిని నెలకొల్పుతున్నామన్నారు. మధ్యప్రదేశ్ వెలుపల హైదరాబాద్, గోవా, ముంబయి, నొయిడా, దిల్లీ, అహ్మదాబాద్, గుజరాత్‌లోని కెవడియా గ్రామం, జైపుర్, కాలిఘాట్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, రాయ్‌పుర్‌లలో ఈ నెల 30వ తేదీ నుంచి ఈ విక్రయ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రకృతి అందాల కోసం అరుణాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే!