దిల్లీ అల్లర్లలో తమ పార్టీకి చెందినవారు పాల్గొన్నట్లయితే రెట్టింపు శిక్ష విధించాలని ఆమ్ ఆద్మీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ మిశ్రా హత్యలో ఆప్ నేత హస్తమున్నట్లు వస్తున్న వార్తలపై ఈ విధంగా స్పందించారు కేజ్రీవాల్.
"ఆప్, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, ప్రోత్సహించినట్లు రుజువైనా వారిని కఠినంగా శిక్షించాలి. నా మంత్రిమండలిలోని వ్యక్తులైనా సరే.. దోషులను జైళ్లలో వేయండి. మా వాళ్లు అలా చేస్తే రెట్టింపు శిక్ష విధించండి."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం
అల్లర్లలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు కేజ్రీవాల్. గాయపడినవారి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
'నాకెలాంటి సంబంధం లేదు..'
దిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఐబీ అధికారి కుటుంబ సభ్యుల ఆరోపణలను ఆయన ఖండించారు.
"ఇది నాపై వస్తున్న తప్పుడు ఆరోపణ. ఈ హత్యతో నాకు, నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. వార్తల్లో చూసిన తర్వాతే నాపై ఆరోపణల విషయం తెలిసింది. ఇవన్నీ నిరాధారం. భద్రత కోసం మా ఇంటిని వదిలి పోలీసుల సమక్షంలో ఉన్నాం. ఈ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. దోషులను కఠినంగా శిక్షించాలి."
-తాహీర్ హుస్సేన్, ఆప్ నేత
అంకిత్ హత్యతో తాహీర్‌కు సంబంధం ఉందని ఐబీ అధికారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆప్‌పై భాజపా విమర్శలు తీవ్రతరం చేసింది.
అల్లర్లలో మరణించిన అంకిత్ మృతదేహం కాలువలో లభించింది. ఈ ఘటనపై దిల్లీ హైకోర్టు కూడా విచారం వ్యక్తం చేసింది.