దేశంలో కరోనా వైరస్ కేసులను వేగంగా గుర్తించేందుకు.. యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించింది భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్). కొవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.
ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్‌ను నిర్ధరించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్.
" హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని స్థానికులను రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ద్వారా పరీక్షించొచ్చు. యాంటీబాడీ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినవారి గొంతు, ముక్కు నమూనాలు సేకరించి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్-పాలీమరేజ్ చైన్ రియాక్షన్‌తో (ఆర్టీ-పీసీఆర్) నిర్ధరించాలి. నెగటివ్ వచ్చినవారిని హోం క్వారంటైన్ చేయాలి."
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
ప్రస్తుతం కరోనా వైరస్ సోకిందా లేదా అని నిర్ధరించేందుకు గొంతు, ముక్కు నుంచి సాంపిల్స్ సేకరించి పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. కానీ ఫలితం వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. యాంటీబాడీ పరీక్షలు ఇతర రక్త పరీక్షల తరహాలోనే ఉంటాయి. 15-30 నిమిషాల్లోనే ఫలితాలొస్తాయి. ఈ తరహా విధానాన్ని మహారాష్ట్రలో అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది.
ఇదీ చూడండి : కరోనాపై యుద్ధానికి మహారాష్ట్ర కొత్త 'రాపిడ్' స్కెచ్