దేశంలో ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై చర్చలు జరుగుతుంటే... మరోవైపు రాహుల్ జననానికి తానే సాక్ష్యమని కేరళకు చెందిన విశ్రాంత నర్సు రాజమ్మ వవతిల్ తెలిపారు. ఆయన పౌరసత్వంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవిగా చెప్పారు. దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 1970, జూన్ 19న రాహుల్ జన్మించారని వయనాడ్‌కు చెందిన రాజమ్మ స్పష్టం చేశారు. రాహుల్ జన్మించినప్పుడు ఎత్తుకున్న వారిలో మొదటి వ్యక్తిని తానేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు జన్మించిన రోజున ఆసుపత్రిలో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు వవతిల్. డెలివరీ కోసం సోనియా గాంధీని ఆసుపత్రికి తీసుకొచ్చాక రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ గది బయట వేచి ఉన్నారని తెలిపారు.
" అప్పుడే జన్మించిన రాహుల్‌ను ఎత్తుకున్న వారిలో మొదటి వ్యక్తిని నేనే కావటం నా అదృష్టం. ఆయన చాలా అందంగా ఉన్నాడు. రాహుల్ జననానికి నేనే సాక్ష్యం. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మనవడిని చూడటం వల్ల మేమందరం పులకరించిపోయాం. 49 ఏళ్ల తరవాత ఆ శిశువు కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉంది. " - రాజమ్మ వవితిల్, విశ్రాంత నర్సు, కేరళ
ఓ బ్రిటన్ సంస్థ తమ వార్షిక రిటర్న్‌ల దాఖలులో భాగంగా రాహుల్ బ్రిటన్ పౌరునిగా పేర్కొంది. దీనిపై భాజపా నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు. స్వామి ఫిర్యాదు పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షునికి నోటీసులు జారీ చేసింది భారత హోంశాఖ.
రికార్డులు ఆసుపత్రిలో ఉన్నాయి...
రాహుల్ గాంధీ పౌరసత్వంపై భాజపా నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు వవతిల్. భారత పౌరుడిగా రాహుల్ గుర్తింపును ఎవరూ ప్రశ్నించలేరన్నారు. స్వామి ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జననంపై అన్ని రకాల రికార్డులు ఆసుపత్రిలో ఉన్నాయని స్పష్టం చేశారు.
నర్సింగ్ కోర్సు... సైన్యం
రాహుల్ గాంధీ జన్మించిన సమయంలో దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నర్సింగ్ కోర్సు చేశారు వవతిల్. అనంతరం భారత సైన్యంలో నర్సుగా విధులు నిర్వర్తించారు. 1987లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేరళలోని కల్లూర్‌లో స్థిరపడ్డారు.
వయనాడ్ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన్ని కలిసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వవతిల్.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌లో చేరినా... ఆర్ఎస్ఎస్ను వీడలేదు'