స్వతంత్ర భారత రెండో రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని.. నేడు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా.. పలువురు ప్రముఖులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయుడు, తత్వవేత్త, పండితుడు, రచయిత అయిన రాధాకృష్ణన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఆయన జీవితం, పనివిధానం, వారసత్వం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని వెంకయ్య అన్నారు. కరోనా కష్టకాలంలో విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పారు వెంకయ్య.
గురువుల సేవలను కొనియాడిన మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విట్టర్ వేదికగా వారి సేవలను కొనియాడారు. 'విద్యార్థుల ఆలోచనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ.. దేశాన్ని నిర్మిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు' అని అన్నారు మోదీ.
'ఆయన గొప్ప ఆలోచనాపరుడు'
'ఎంతోమంది పిల్లలకు మార్గనిర్దేశం చేస్తూ.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ సోదరులకు శుభాకాంక్షలు' అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రాధాకృష్ణన్ గొప్ప ఆలోచనాపరుడు, వివేకవంతుడైన పండితులని ఈ సందర్భంగా సర్వేపల్లిని గుర్తుచేసుకున్నారు షా.
ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!