నాలుగో విడత లాక్డౌన్ ముగుస్తున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్షా.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మే 31 తరువాత లాక్డౌన్ పొడిగింపు విషయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన ప్రధానికి వివరించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలిఫోన్లో మాట్లాడారు. లాక్డౌన్ పొడిగింపు విషయంలో వారి సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇంతకు ముందు లాక్డౌన్ పొడిగింపు ప్రతి దశలోనూ ప్రధాని మోదీనే స్వయంగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ తాజాగా అమిత్షా ఆ బాధ్యతలను తీసుకున్నారు.
ఐదో విడత లాక్డౌన్?
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ మార్చి 24న మొదటిసారి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. తరువాత దాన్ని మే 3 వరకు; తరువాత మే 17 వరకు; తరువాత మే 31 వరకు... ఇలా నాలుగు సార్లు లాక్డౌన్ పొడిగించారు. ఇప్పుడు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు...
అమిత్ షాతో మాట్లాడిన చాలా మంది ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించాలని, క్రమంగా సాధారణ జనజీవనం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం.
లాక్డౌన్పై వచ్చే రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
లాక్డౌన్ కొనసాగించే అంశంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో విడివిడిగా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లు చర్చించనున్నట్లు సమాచారం
కరోనా విజృంభణ
దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నా కరోనా మహమ్మారి మాత్రం విశృంఖలంగా విజృంభిస్తోంది. శుక్రవారం నాటికి 1,65,799 కరోనా కేసులతో భారత్ ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో ఉంది.
సడలింపులు..
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి దుకాణాలకు, మార్కెట్లకు సడలింపులు ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులను పరిమిత సంఖ్యలో అనుమతించింది. అయితే విద్యాసంస్థలు, హోటళ్లు, సినిమా హాళ్లు, మాల్స్, ఈత కొలనులు తెరవడానికి మాత్రం నిషేధం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే సామాజిక, రాజకీయ, మత సంబంధమైన సభలు, సమావేశాలు జరపడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కరోనా పోరులో భారత్ సాయంపై ఐరాస ప్రశంసలు