దాదాపు 8 సంవత్సరాలుగా గాలిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ అగ్రనేత, జమ్ముకశ్మీర్ టాప్ కమాండర్ రియాజ్ నైకోను తుదముట్టించింది సైన్యం. మంగళవారం రాత్రి నుంచి సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టి.. మొత్తం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. సీనియర్ సైనికాధికారుల పర్యవేక్షణలో రూపొందిన కార్యాచరణ పక్కా ప్రణాళికతో సాగింది.
అవంతిపొరాలోని భేగ్పొరాలో నైకో.. నక్కి ఉన్నాడన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసు విభాగంతో కలిసి.. భారత సైన్యం సంయుక్తంగా అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాద శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని భద్రతా దళాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాయి. లోయ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నిషేధించి.. దిగ్బంధ పరిస్థితుల్ని సృష్టించారు అధికారులు. అంతర్జాల సేవల్నీ నిలిపివేశారు.
అనేక గంటల పాటు సాగిన ఎన్కౌంటర్లో చివరకు నైకోను తుదముట్టించాయి. ఇతడితో పాటు మరో ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. షార్షాలీ ఖ్రూలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం.
బుర్హాన్ వానీ తర్వాత..
హిజ్బుల్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు బుర్హాన్ వానీ హతమైన తర్వాత.. ఉగ్ర సంస్థ కార్యకలాపాల్నీ రియాజే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్నో ఉగ్రకార్యకలాపాల వెనుక ఇతని హస్తం ఉంది. భద్రతా దళాల హిట్‌లిస్ట్‌లో ఉన్న నైకో తలపై రూ.12 లక్షల రివార్డు ఉంది.
రియాజ్ హతమైన అనంతరం.. జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్ శకం అంతమైనట్లేనని తెలుస్తోంది. వేరే నాయకుడు ఎవరూ లేకపోవడం వల్ల ఈ ఉగ్రసంస్థ బలహీనపడుతుందని అనుకుంటున్నారు.
మోస్ట్ డేంజరస్...
తొలుత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న రియాజ్.. క్రమక్రమంగా ఉగ్రవాదంవైపు మళ్లాడు. తన ప్రవర్తనతో, చేష్టలతో.. ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. కశ్మీర్‌లోయలో ఎందరో యువకుల్ని ఉగ్రవాదంవైపు ఆకర్షించడంలో ఇతడి పాత్ర కీలకం.
భద్రతా దళాల చేతిలో జకీర్ మూసా.. గతేడాది మేలో హతమైన తర్వాత హిజ్బుల్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు రియాజ్.
కశ్మీర్లో అధికరణ 370 రద్దు తరవాత.. నైకో దేశ వ్యతిరేక ప్రచారం ప్రారంభించాలని ప్రణాళికలు రచించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. యువకులతో సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయించి.. లోయలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లు వెల్లడించారు.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ రంజాన్ వేళ రియాజ్.. కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించాలనుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. పెద్ద సంఖ్యలో స్థానిక గ్రామాల్లోంచి యువతను ఉగ్రవాదంలోకి లాగాలని ప్రయత్నాలు జరిగాయని ఓ నిఘా అధికారి వెల్లడించారు. అందులో భాగంగానే సైన్యానికి చిక్కిన ఓ ఉగ్రవాది రియాజ్ ఆచూకీ చెప్పినట్లు ఆయన తెలిపారు.