కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ అయినప్పటికీ వైరస్ ప్రభావం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్యల సమాచారాన్ని కోలుకున్న వారి నుంచి సేకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను ప్రారంభించింది. ఇందుకోసం జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థతో కలిసి ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకున్న వారికి ఫోన్ చేసి సర్వే జరపాలని భావిస్తోంది. దీని కోసం ఓ ముసాయిదాను కూడా ఏర్పాటు చేసింది.
శ్వాసకోశ సమస్య, గుండె రక్తనాళాలకు సంబంధించిన, నాడీ సమస్యలు, పిల్లలలో రోగనిరోధక శక్తి, ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అని పలు దేశాలు సూచించిన అంశాలను ముందుగా తెలుసుకోనున్నారు. ఈ సమస్యలకు చెందిన డేటాను సేకరించటం కోసం ఐసీఎంఆర్ ఓ రిజిస్టర్‌ను డెవలప్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..
" ఇంకా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో కరోనా అనంతరం తలెత్తే సమస్యలకు సంబంధించిన డేటాను పర్యవేక్షించడం, సేకరించడం ఎంతో అవసరం. సేకరించిన సమాచారంతో ప్రజల ఆరోగ్యం సమస్యపై అంచనాకు రావొచ్చు." అని ఓ అధికారి తెలిపారు.
తలెత్తిన సమస్యలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ పర్యవేక్షణ బృందం నిమగ్నమైనట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమైన అనంతరం వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు, అక్కడ నుంచి కోలుకున్న బాధితుల ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు పంపనున్నారు.
రోగి వయస్సు, వృత్తి, అనారోగ్య పరిస్థితి, వైరస్ లక్షణాలు ఉన్నాయా? లేవా? ఎప్పుడు పాటిజివ్‌గా నిర్ధరణ అయ్యింది, డిశ్చార్జ్ ఎప్పుడు అయ్యారు వంటి అంశాల ఆధారంగా మార్గదర్శరాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ లక్షణాలపై దృష్టి...
- దీర్ఘకాలిక దగ్గు,
- శ్వాస తీసుకోవటంలో సమస్య,
- మూత్రపిండాల పని తీరు,
- గుండె సమస్య,
- రుచి, వాసన కోల్పోవటం,
- బలహీనంగా ఉండటం, ఇతర సమస్యల గురించి తెలుసుకోనున్నారు.
ప్రస్తుత కరోనా నుంచి కోలుకున్నప్పటికీ శరీర అవయావాలపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో వీటిని అధ్యయనం చేయానికి అన్ని ఆసుపత్రుల్లో పోస్ట్ కొవిడ్ క్లీనికల్ కేంద్రాలు ఉండాలని ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు.