దేశాన్ని నివ్వెరపరిచే విషాదకర ఘటన జరిగిన ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ జిల్లా బుల్గర్హి గ్రామంలో.. పోలీసుల పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు గ్రామంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఈ చిన్న గ్రామం ఇప్పుడు ఓ శత్రు దుర్భేధ్య కోటలా మారిపోయింది.
గ్రామంలోని ప్రతీ వీధిలో పోలీసులు దర్శనమిస్తున్నారు. అనుకోని ఘటనలు తలెత్తితే అడ్డుకొనేందుకు పోలీసులను రంగంలోకి దించారు. అలజడులను నియంత్రించేందుకు 60 మంది కానిస్టేబుళ్లను మోహరించినట్లు గ్రామంలోని ఓ అధికారి వెల్లడించారు.
రాత్రి సమయంలో గ్రామంలోకి రాకపోకలు నిషేధించారు. గ్రామానికి ఉన్న ప్రవేశ ద్వారాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలిమేర వద్ద గట్టి నిఘా ఉంచారు.
విషాదకర ఘటన
గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ దిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది బాధిత యువతి. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.
ఇదీ చదవండి- 'కూతుళ్లకు విలువలు నేర్పితే అత్యాచారాలు ఆగుతాయ్'