భారత్కు 'జీఎస్పీ' (ప్రాధాన్యతల సాధారణ వ్యవస్థ) హోదా రద్దు చేసినా... అమెరికాకు చేసే ఎగుమతులపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాదవాన్ అభిప్రాయపడ్డారు. భారతీయ ఎగుమతులపై పన్ను ప్రయోజనాలను ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో అనూప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏటా భారత్ నుంచి అమెరికాకు 5.6 బిలియన్ డాలర్లు విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. జీఎస్పీ హోదాతో వీటిపై పన్ను ప్రయోజనం మాత్రం 190 మిలియన్ డాలర్లేనని అనూప్ తెలిపారు.
ఏంటీ హోదా...?
1976లో అమెరికా 'జీఎస్పీ విధానం' ప్రవేశపెట్టింది. దీని వల్ల భారత్ నుంచి ఏటా సుమారు 1900 ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో ప్రధానంగా ముడి పదార్థాలు, సేంద్రీయ రసాయనాలు వంటివి ఉన్నాయి.
ప్రస్తుతం వైద్యపరికరాలు, పాల ఉత్పత్తుల ఎగుమతులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇది భారత ప్రయోజనాలకు విరుద్ధమని కేంద్రం నిరాకరించింది. ఇందుకు ప్రతిగా జీఎస్పీ హోదా రద్దుకు సిద్ధమయ్యారు ట్రంప్.