రఫేల్ అంశంలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ శాఖ నుంచి అపహరణకు గురయ్యాయని కోర్టుకు అటార్నీ జనరల్ కెకె. వేణుగోపాల్ విన్నవించారు.
రఫేల్ విషయంలో ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు బుధవారం స్వీకరించింది.
వ్యాజ్యంపై భూషణ్ వాదనలు వినిపించారు. గతంలో రఫేల్‌పై విచారణలో అసత్య నివేదికలు ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని వివరించారు.
రఫేల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఓ పత్రిక ఇటీవల ప్రచురించింది. తాజాగా రక్షణ శాఖ నుంచి పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యోచిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సమీక్ష వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. కీలక పత్రాలను దొంగిలించారని ఒక పత్రికపై కేంద్రం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫలితంగా మార్చ్ 14కు విచారణ వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
రఫేల్ ఒప్పందంలో సందేహించాల్సిన తప్పిదాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది డిసెంబరు 14న సుప్రీం సచ్ఛీలత పత్రమిచ్చింది.
ఇదీ చూడండి:కారుపార్కులో వర్ణమాల