మహాత్మ... అన్న పదం వినగానే సగటు భారతీయుడికి గుర్తొచ్చే పేరు గాంధీ. మహాత్ములు ఎందరో ఉన్నా.. ఈ బక్కపలచని, బోసి నవ్వుల తాతయ్య పేరు ముందు.. 'మహాత్మ' అన్న పదం బిరుదుగా ఎలా మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఖద్దరు కట్టి.. చేత కర్ర పట్టి.. స్వతంత్ర పోరాటం చేపట్టి.. తెల్లవాళ్లను తరిమి కొట్టి.. భరతమాతకు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించిన ఈ మామూలు మనిషి.. ఎలా మహాత్ముడయ్యాడు.?
ఎవరైనా తనని మహాత్మా అని పిలిస్తే గాంధీ ఆలోచించేవారట. ఎందుకంటే తాను అందరిలాంటి మనిషినేనని బాపూజీ భావించేవారు. అయితే అంతటి పేరు సంతరించుకోవటానికి మాత్రం ఆయన లక్ష్యాలే కారణం. అయితే కాలం, పరిస్థితులు కూడా గాంధీని మేరునగధీరుడ్ని చేయడంలో తమ వంతు పాత్ర పోషించాయి. ఆయన వ్యక్తిత్వం బాపూజీని హిమోన్నత శిఖరాలకు చేర్చింది.
తప్పులు చేసినా...
అందరిలానే గాంధీ ఆయన జీవితంలో ఎన్నో తప్పులు చేశారు. అయితే ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఈ తీరే ఆయన అభ్యున్నతికి కారణమైంది. జీవితంలోని ప్రతి మెట్టు దగ్గర ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నారు. తప్పు జరిగితే నిస్సంకోచంగా ఆత్మపరీక్ష చేసుకునేవారు.
చేసే పనుల్లోనే కాదు చివరికి ఆలోచనల్లో కూడా ఏదైనా తప్పు దొర్లితే అది దైవం గమనిస్తుందని భావించేవారు బాపూ. ప్రపంచం మన తప్పుల్ని గమనించే లోపు.. మనమే వాటిని ఒప్పుకోవాలి అంటారు మహాత్ముడు.
వజ్రాయుధం...
ఒకసారి దక్షిణాఫ్రికాలోని ఫినిక్స్ ఆశ్రమంలో ఏదో తప్పు చేసినందుకు శిక్షగా ఒక పూట భోజనం చేయకుండా, ఉప్పు వినియోగించకుండా ఉన్నారు. ఇలాంటివే గాంధీని ఆమరణ నిరాహారదీక్షలకు సిద్ధం చేశాయి.
గాంధీ నియమాలు ఆశ్రమవాసులకు, సమాజానికి అలా నెమ్మదిగా చేరాయి. ఎప్పుడైనా స్వతంత్ర సంగ్రామంలో హింస చెలరేగినా, సమాజంలో మతోన్మాదాలు, వర్గ పోరాటాలు పెచ్చరిల్లినా వాటిపై సత్యాగ్రహమనే వజ్రాయుధాన్ని ప్రయోగించేవారు గాంధీ.
తన తప్పు తానే...
సాధారణంగా మనుషులు ఇతరుల తప్పులు వెతుకుతూ ఉంటారు. అయితే గాంధీ మాత్రం తనలో తప్పులు వెతికేవారు. ఏ చిన్న తప్పు దొరికినా దాన్ని.. అతిపెద్ద దోషంగా పరిగణించేవారు. ఎప్పుడు అది గమనించారో.. ఆ మరుక్షణమే ఇతరులకు తాను చేసిన దాని గురించి చెప్పేవారు. ఇలా నిరంతర బాటసారిగా.. సత్యాన్వేషణలో.. హిమాలయ శిఖరాలను అధిరోహించారు.
తర్కం, నమ్మకం..?
గాంధీలోని మరో ఆచరణీయ గుణం... తర్కాన్ని, నమ్మకానికి ఆయన ఇచ్చే సమాంతర విలువ. ఎప్పడూ తార్కిక ఆలోచనలనే బాపూ అంగీకరించేవారు. అయితే ఆయనంతటి మతవిశ్వాసకులూ ఎవరూ ఉండరు. వేదాంతం, యోగాభ్యాసం గురించి ఎవరు చెప్పినా శ్రద్ధగా వినే గాంధీ... తత్వజ్ఞానం, మరణానంతర జీవితం వంటి విషయాలను మాత్రం నమ్మేవారు కాదు.
ఈ లోకంలో దైవం ఉన్నాడని... ప్రతి జీవిలో దైవత్వం ఉందని నమ్ముతారు గాంధీ. సత్యాన్ని దైవంగా భావించే గాంధీ... అహింసతోనే దాన్ని అందుకోగలమని స్పష్టం చేశారు.
తప్పు అని అనిపిస్తే...
అంటరానితనాన్ని, అంతఃకలహాల్ని బాపూజీ నిష్కర్షగా వ్యతిరేకించేవారు. ఒకవేళ ఎవరైనా హిందుత్వవాదులు వేదాలు అంటరానితనాన్ని సమర్థిస్తాయని నిరూపిస్తే.. వాటినీ వ్యతిరేకిస్తానని బహిరంగంగా ప్రకటించారు.
విలువలు లేకపోతే హాని...
చాలా మంది ఆర్థికవేత్తలు ఆర్థికశాస్త్రాన్ని ఒక విజ్ఞానశాస్త్రంగా భావించి.. విలువలతో పనేముంది అంటారు. అయితే గాంధీ మాత్రం విలువలు లేని ఆర్థిక స్వేచ్ఛ హాని కలిగిస్తుందని స్పష్టం చేశారు. మానవత్వంతో కూడిన రాజకీయాలు రావాలని.. అవే ప్రజలకు మేలు చేస్తాయన్నారు గాంధీ.
వీటితో అంచనాకు రారు...
చదువు, అంతస్తు, రంగు, కులం, మతం, వర్గం ఇలాంటి వాటిని చూసి గాంధీ ఎవరిపైనా ఒక అంచనాకు రారు. ప్రతి వ్యక్తికి తనదైన వ్యక్తిత్వం ఉంటుందని నమ్ముతారు గాంధీ. రాజకీయనాయకులు తమ పదునైన ప్రసంగాలపై దృష్టి సారిస్తారు. అయితే ఇందుకు గాంధీ పూర్తిగా వ్యతిరేకి. ఆయన తన దగ్గరకు వచ్చేవారు చెప్పేది శ్రద్ధగా వినేవారు.
చెప్పిన మరుక్షణమే...
అహ్మదాబాద్ సబర్మతి నుంచి తన ఆశ్రమాన్ని వార్దాలోని సేవాగ్రామ్కు తరలించేటప్పుడు పక్కనున్న గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా అక్కడి వారికి చెప్పారు. అనంతరం తానే అక్కడి వీధులను శుభ్రం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
గాంధీ ఏం చెబితే అది చేశారు. ఏం చేశారో అదే చెప్పారు.. అందుకే ఆయన జీవితం ఒక సందేశం.. ఆయన మామూలు మనిషి నుంచి మహాత్ముడు కావడానికి ఈ విలువలే కారణం.
(రచయిత - నచికేత దేశాయ్)
ఇదీ చూడండి : కశ్మీర్ లోయలో నక్కిన 273 మంది ఉగ్రవాదులు