భారత్-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించారు త్రివిధ దళాధిపతులు. చైనా నుంచి 3,500 కిలోమీటర్ల వాస్తవసరిహద్దులో గస్తీ కాస్తున్న వారందరూ అనుక్షణం అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు.
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాక్లలోని అన్ని ప్రముఖ సరిహద్దు బేస్ క్యాంపులకు ఇప్పటికే అదనపు బలగాలను మోహరించింది భారత సైన్యం. హిందూ మహా సముద్రంలోనూ బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది భారత నావికాదళం.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధ్యక్షులు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అనంతరం సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తూర్పు లద్దాక్‌లోని గాల్వన్‌లోయలో చైనా-భారత్ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణ కారణంగా 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు కూడా కొంతమంది చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
'భారత్ సిద్ధంగా ఉండాలి'
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని సూచించారు భారత మాజీ సైన్యాధ్యక్షులు రాయ్ చౌదరి. అయితే యుద్ధం వరకూ వెల్లకుండా.. చర్చలతోనే పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించారు.
" 1962లో భారత్-చైనాలు యుద్ధం చేశాయి. భారత్ గానీ, చైనా గానీ 1962లో ఉన్నట్లుగా లేవు. ఇరుదేశాల శక్తి ప్రస్తుతం రెండింతలు పెరిగింది. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో చర్చల ద్వారా పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాలి. భారత్ తమ భూభాగంలోనే ఓ వంతెన నిర్మాణం చేపట్టింది. కానీ చైనాకు అది నచ్చలేదు. అందుకే ఈ ఘర్షణ జరిగిందని అనుకుంటున్నా. ఇదంతా సైనికపరంగా మాత్రమే ఆలోచించి చెబుతున్నా.. తుది నిర్ణయం మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది."
- రాయ్ చౌదరి, భారత మాజీ సైనికాధికారి