కరోనా మహమ్మారితో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టుపైనా ఆ ప్రభావం పడింది. గగన్యాన్ మిషన్లో భాగంగా.. 2020, డిసెంబర్లో చేపట్టాల్సిన తొలి మానవ రహిత ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవరహిత మిషన్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే స్పేస్ కమిషన్కు సమాచారం ఇచ్చినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
"మానవరహిత మిషన్ ప్రయోగానికి అనుకున్న గడువులోపు చేరుకోలేకపోవచ్చు. కరోనా మహమ్మారి అనేక అంతరాయాలకు దారితీసింది. ఈ విషయాన్ని ఇటీవల అంతరిక్ష కమిషన్కు కూడా తెలియజేశాం. రష్యాలో ఉన్న నలుగురు వ్యోమగాముల శిక్షణపైనా కరోనా ప్రభావం పడింది. ప్రస్తుతం వారి శిక్షణ తిరిగి ప్రారంభమైంది. 2021, డిసెంబర్ నాటికి మానవ సహిత మిషన్ను ప్రయోగించలేకపోయినా.. ఎనిమిది నెలల్లోపే సాధించి తీరుతాం."
- ఇస్రో వర్గాలు
రెండేళ్ల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మానవ సహిత గగన్యాన్ మిషన్ను ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022 నాటికి అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను సుమారు 5-7 రోజుల పాటు పంపాలని గగన్యాన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దాని ప్రకారమే ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ముందుగా రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. తొలి మానవ రహిత మిషన్ 2020 డిసెంబర్, రెండోది 2021 జూన్లో చేపట్టాలని నిర్ణయించారు. మరో ఆరు నెలల అనంతరం తుది మిషన్ మానవ సహిత గగన్యాన్ను 2021, డిసెంబర్లో చేపట్టేందుకు ప్రణాళిక రచించారు.
కరోనా వైరస్ కారణంగా అంతరిక్ష సంస్థ పనుల్లో అంతరాయం ఏర్పడినందుకు అనేక మిషన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇస్రో గతంలోనే సూచించింది. కరోనాతో ప్రధాన ప్రాజెక్టులైన చంద్రయాన్-3, గగన్యాన్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే.. 2022 గడువులోపు మానవ సహిత మిషన్ను చేపట్టే దిశగా కార్యకలాపాలు సాగుతున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:శిలను నాదస్వరంలా మార్చిన యువకుడు