కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రభుత్వ విశ్రాంత ఉన్నతాధికారుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగడాన్ని బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు 60 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు.
"కరోనా తరుముతోన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.20 వేల కోట్లతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ప్రజలకు ఆర్థికంగా సాయం అందించవచ్చు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవచ్చు. వాటికి కాకుండా ఇలా భవనాల పునరుద్ధరణకు ఖర్చు చేయటం.. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఉంది."
- ప్రభుత్వ మాజీ అధికారుల బృందం
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్రపతి భవన్- ఇండియా గేట్ మధ్య ప్రాంతంలో కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించతలపెట్టింది కేంద్రం. కొత్త పార్లమెంటు భవనంతో పాటు ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు, మంత్రుల సచివాలయాలను రూ.20 వేల కోట్లతో కట్టాలని నిర్ణయించింది ఎన్డీఏ ప్రభుత్వం.
ఈ విషయంలో పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకపోవటం బాధాకరమని మాజీ అధికారులు పేర్కొన్నారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని, నిపుణుల సలహాలను కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
"దిల్లీ నగరానికి ఈ ప్రాంతం ఊపిరిత్తుల వంటిది. ఇక్కడి వృక్షాలు, జీవవైవిధ్యమే ఈ మహానగరానికి ప్రాణవాయువు అందిస్తోంది. ఇక్కడ భారీ నిర్మాణాలు చేపడితే ఈ పరిస్థితులు అన్నీ తారుమారు అవుతాయి. ఇప్పటికే కాలుష్యం తీవ్రంగా ఉన్న దిల్లీ వాతావరణానికి మరింత నష్టం తప్పదు. పర్యటకంగానూ ఈ ప్రాంతం చాలా ప్రఖ్యాతి ఉంది. దీనికి గండి పడే అవకాశం ఉంది."
- ప్రభుత్వ మాజీ అధికారులు
ఈ అధికారుల బృందంలో దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ (డీడీఏ) మాజీ వైస్ ఛైర్మన్ వీఎస్ ఐలావాడి, ప్రసార భారతి మాజీ సీఈఓ జవహర్ సర్కార్ కూడా ఉన్నారు.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు మార్గం సుగమం