కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారికి ఐదు రోజుల పాటు తప్పనిసరిగా సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచాలంటూ జారీ చేసిన ఉత్తర్వు వివాదాస్పదమైన నేపథ్యంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెనక్కి తగ్గారు. ఈ మేరకు ఆ ఉత్తర్వును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా రోగులను క్వారంటైన్‌లో ఉంచాలంటూ ఆయన జారీ చేసిన ఉత్తర్వుపై అధికార ఆమ్ ఆద్మీపార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దేశమంతా ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఒకలా ఉంటే.. దిల్లీ నగరానికి మాత్రం ప్రత్యేక నిబంధనలు ఎందుకంటూ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించినట్టు ఓ అధికారి వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇది సాధ్యమా?
ఈ ఉత్తర్వు ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని.. కరోనా లక్షణాల్లేని, కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారికి హోంక్వారంటైన్‌కు ఐసీఎంఆర్ అనుమతిచ్చిందని డిప్యూటీ సీఎం సిసోడియా తెలిపారు. ఎక్కువ మంది కరోనా రోగుల్లో అసింప్టమాటిక్, కొద్దిపాటి లక్షణాలు ఉన్నవాళ్లేనన్నారు. మరి అలాంటి వారి కోసం ఎలా ఏర్పాట్లు చేయగలమని ప్రశ్నించారు.
వేడి తట్టుకోగలరా?
రైల్వే శాఖ రూపొందించిన ఐసోలేషన్ కోచ్‌లు కూడా లోపల చాలా వేడిగా ఉన్నాయనీ.. వాటిలో రోగులు ఉండలేరని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దిల్లీలో నిన్నటి వరకు 53వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 27వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 10వేల మందికిపైగా కరోనా బాధితులు హోం ఐసోలేషన్లోనే ఉన్నట్టు సమాచారం.
లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాన్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా తప్పుపట్టారు. కేంద్రం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంట్లో ఉండి కోలుకొనే అవకాశం ఉన్నవాళ్లను 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న రైల్వే కోచ్‌లలోకి పంపించాలని చూస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
ఇదీ చూడండి: అరుదైన బల్లి జాతిని కనుగొన్న సీఎం కుమారుడు