కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఒకే దేశం- ఒకే మార్కెట్' ఆర్డినెన్సును రద్దు చేయాలని పంజాబ్‌లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే దేశం- ఒకే మార్కెట్‌పై కేంద్రం జారీ చేసిన పోస్టర్ ప్రకటనలో తన ఫొటోను ఉపయోగించడంపై ఫరీద్కోట్కు చెందిన గుర్ప్రీత్ సింగ్ అనే రైతు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆర్డినెన్సును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుర్ప్రీత్. పోస్టర్లపై తన ఫొటోను సైతం తొలగించాలని స్పష్టం చేశారు.
రైతులకు ప్రయోజనాలు కలిగించే సంక్షేమ పథకాలపై తన ఫొటోను ప్రచురిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఈ ఆర్డినెన్స్ ప్రచార పత్రాలపై తన ఫొటో ఉపయోగించడం మాత్రం ఇష్టంలేదన్నారు.
ఇదీ చదవండి- కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు