కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలైన పౌరసత్వ సవరణ చట్టం, 370 అధికరణ రద్దును విదేశీవ్యవహారాల మంత్రి జైశంకర్.. ఐరోపా సమాఖ్య వేదికపై గట్టిగా సమర్థించారు.
ఈయూతో మెరుగైన సంబంధాలే లక్ష్యంగా బ్రస్సెల్స్ పర్యటనలో ఉన్నారు జైశంకర్. సోమవారం జరిగిన సమాఖ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఏఏ, అధికరణ 370 రద్దుని కొన్ని దేశాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని జైశంకర్ సభ్యులకు వివరించారు. ఐరోపా దేశాల్లో అమలవుతున్న ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ రీసెటిల్‌మెంట్ విధానాలతో సీఏఏని పోల్చి వివరించారు. భారత్‌కు పొరుగున ఉన్న దేశంలో ఇస్లాం అధికారిక మతంగా ఉందని అక్కడి మైనారిటీలపై అకృత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. అందుకే అక్కడివారు భారత్‌లో ఆశ్రయం కోరుతూ వస్తున్నారని వివరించారు. ఆర్థిక సహకారం, వాతావరణ మార్పులు సహా పలు అంశాల్లో.. భారత్, ఈయూ మధ్య సంబంధాలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను.. జైశంకర్ ప్రస్తావించారు.
సీఏఏ కొన్నివర్గాల మధ్య విభజనకు కారణమయ్యేదిగా ఉందంటూ ఇటీవల ఈయూలో కొంతమంది సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో జైశంకర్ అదే వేదికపై వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చూడండి: ట్రంప్ పర్యటనతో వాణిజ్య యుద్ధానికి తెర పడేనా?