జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు వ్యవహారంలో ఆంగ్ల మీడియా తీరును విమర్శించారు భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్. అధికరణ 370 రద్దుపై వాస్తవాలను పక్కనబెట్టి వెలువరించి కథనాలు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టాయని ఆరోపించారు.
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం రెండో వార్షిక సదస్సులో పాల్గొన్న జయ్శంకర్.. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలు రచ్చ చేయటంవల్ల దీనికి అంతర్జాతీయంగా ఆసక్తి ఏర్పడవచ్చని పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా భారత్ వివరించిందని జయ్శంకర్ తెలిపారు. అయితే ఉదారవాద ఆంగ్లమీడియా పూర్వ పరిస్థితుల ఆధారంగా వ్యవహరించిందని ఆరోపించారు.
"సెప్టెంబర్‌లో నేను అమెరికాలో పర్యటించాను. వారికి వివరించాక కశ్మీర్‌పై ఇతర దేశాలు చూసే దృష్టిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారు.
అయితే మీడియాలో ముఖ్యంగా ఉదారవాద ఆంగ్లమీడియా.. వాస్తవాలను పక్కనబెట్టి పూర్వ పరిస్థితుల ఆధారంగా భావజాలాన్ని నింపుకొంది. వాళ్లకు వాస్తవాలు తెలియదో.. అర్థం చేసుకోలేకపోయారో నాకు తెలీదు. కానీ ఇది సమస్యను మరింత జటిలం చేసింది."
-జయ్శంకర్, విదేశాంగ మంత్రి
ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధన మాత్రమేనని జయ్శంకర్ పేర్కొన్నారు. కానీ విషయాన్ని సదరు మీడియా ఎక్కడా ప్రస్తావించలేదని ఆరోపించారు.
ఇదీ చూడండి:హరియాణా దంగల్: 'ఫిర్ ఏక్ బార్ భాజపా సర్కార్'!