వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాకే ఈవీఎంలలో ఓట్లు లెక్కపెట్టాలన్న విపక్షాల అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. మంగళవారం విపక్ష నేతలు కలిసి చేసిన విజ్ఞప్తిపై ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.
ఇదీ నేపథ్యం...
విపక్షాల న్యాయపోరాటం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... ప్రస్తుతం ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్ల స్లిప్పులు మాత్రమే లెక్కిస్తారు. అది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక. ఈ విధానం విపక్షాలకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.
ముందుగా వీవీప్యాట్లు లెక్కించాలని, తేడా వచ్చినచోట్ల 100శాతం స్లిప్పులు గణించాలన్నది విపక్షాల డిమాండ్. ఈ మేరకు మంగళవారం ఈసీకి వినతిపత్రం సమర్పించారు విపక్ష నేతలు.
విపక్షాల అభ్యర్థనపై ఎన్నికల సంఘం నేడు చర్చించింది. ఈవీఎంలకన్నా ముందే వీవీప్యాట్ రసీదులు లెక్కపెట్టాలన్న వినతిని తోసిపుచ్చింది.