భారత్-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకటమే లక్ష్యంగా ఎనిమిదో దఫా కార్ఫ్స్ కమాండ్ స్థాయి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. ఈనెల 6న తూర్పు లద్ధాఖ్లోని చుషూల్ ప్రాంతంలో ఇరు దేశాల అధికారులు భేటీ కానున్నారు.
భారత బృందానికి ఇటీవలే లేహ్ కమాండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న లెఫ్టినెంట‌్ జనరల్ పీజీకే మేనన్ నేతృత్వం వహించనున్నారు. ఆయన తొలిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
శీతాకాలంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. ఈ క్రమంలో జరగనున్న ఎనిమిదో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్- చైనా సంబంధాలపై సరిహద్దు సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. సరిహద్దులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై చైనా గౌరవం చూపాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఏప్రిల్-మే సమయంలో తూర్పు లద్దాఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవటం, ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలల తర్వాత పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని కీలక పర్వతాలను భారత్ కైవసం చేసుకుంది. భారత బలగాలు వాస్తవాధీన రేఖకు తమవైపే ఉన్నప్పటికీ.. చైనా వ్యతిరేకిస్తోంది.
ఈ క్రమంలో ఇరు దేశల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. అక్టోబర్ 12న చివరిసారిగా, ఏడో విడత కార్ఫ్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణ, యథాతథ స్థితిని పునరుద్ధరించటం సహా కీలక అంశాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: మోదీ-జిన్‌పింగ్ స్థాయి చర్చలతోనే ఫలితాలు!