నేపాల్‌లోని ఓ రిసార్టులో ఉన్న కేరళకు చెందిన ఎనిమిది మంది పర్యటకులు మృతి చెందారు. ఇందులో నలుగురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ లీకైన కారణంగానే వీరందరూ మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్పృహ కోల్పోయిన పర్యటకులను కాఠ్మాండూలో హెచ్ఏఎంఎస్ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
"ఎనిమిది మందిని కాట్మాండూలోని ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించాం. క్షతగాత్రుల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఓ భారతీయ వైద్యుడిని సైతం ఆస్పత్రికి పంపించాం. కానీ మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు."
-నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం
కేరళకు చెందిన 15 మంది బృందం నేపాల్‌లోని ప్రఖ్యాత పర్వత పర్యటక కేంద్రమైన పోఖరా ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో మకవాన్పుర్ జిల్లా డామన్ ప్రాంతంలో పనోరమ రిసార్టులో దిగినట్లు చెప్పారు. వెచ్చదనం కోసం గదిలోని గ్యాస్ హీటర్‌ను ఉపయోగించినట్లు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ సమయంలో గది కిటికీలు, తలుపులు అన్నీ లోపలి నుంచి మూసి ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో సాధ్యమైన సహాయం అందించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు.
ఇదీ చదవండి: 'జేఎన్‌యూ వీసీ తొలగింపు డిమాండ్ అహేతుకం'