క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఓటరు జాబితాలను సరిదిద్దే ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందు కోసం నేటి నుంచి దేశవ్యాప్తంగా మెగా ఓటర్ల ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఓటరు నమోదుకు సంబంధించి ఆన్లైన్లో ఎన్వీఎస్పీ వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను పొందుతారు. తన ఓటరు ధ్రువీకరణకు అవసరమైన పత్రాలను జతచేయడమే కాకుండా తన కుటుంబ సభ్యుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేయవచ్చు. ఇలా నమోదు చేసిన వివరాలను బ్లాక్ లెవల్ అధికారులు ధ్రువీకరిస్తారు.
ఈ విధానం ద్వారా ఓటర్లకు.. జాబితా వివరాలను అంచనా వేయడానికి, ఓటరు వివరాల్లో తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుందని దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణ్‌బీర్ సింగ్ తెలిపారు. మెగా ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: పడవ పోటీల్లో మాస్టర్ బ్లాస్టర్ మెరుపులు