జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద తనను అనవసరంగా నిర్బంధించి అన్నివిధాలా క్షోభకు గురిచేశారని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పిల్లల వైద్యుడు కఫీల్ ఖాన్ ఆరోపించారు. తనపై నిర్బంధాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన దృష్ట్యా తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బీఆర్‌డీ వైద్య కళాశాలలో ఆక్సిజన్ కొరత కారణంగా అనేకమంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి ఆయన కారణమంటూ తొలుత ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణలో చాలా అభియోగాల నుంచి ఖాన్ బయటపడ్డారు. అయితే.. 2019 డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అలీగఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రెచ్చగొట్టేలా మాట్లాడారనే అభియోగాలు మాత్రం ఆయన్ని ఇరుకునపెట్టాయి. యూపీ ప్రత్యేక కార్యదళం (ఎస్‌టీఎఫ్) పోలీసులు ఆయన్ని కఠినతరమైన ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద నిర్బంధంలో తీసుకున్నారు. ఇది అక్రమమని, ఆయన ప్రసంగంలో విద్వేషపూరిత అంశాలు లేవని అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ప్రసంగంలో కొంత భాగాన్నే తీసుకుని దిగువ కోర్టు అరెస్టు ఉత్తర్వులు ఇచ్చిందని వ్యాఖ్యానించింది. వెంటనే విడుదలకు ఆదేశించింది.
లోపాలను ఎండగట్టినందుకే ఇరికించారు
హైకోర్టు తీర్పు అనంతరమైనా సస్పెన్షన్‌ను ఎత్తివేసి, తనను ఉద్యోగంలో చేర్చుకోకపోతే అసోంలో వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించుకుంటానని ఖాన్ తెలిపారు. 'యూపీ కంటే రాజస్థాన్ సురక్షితమనే ఉద్దేశంతో జైపుర్‌కు వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. వ్యవస్థలో లోపాలను ఎండగట్టినందుకే యూపీ సర్కారు నన్ను తప్పుడు కేసులో ఇరికించింది. గోరఖ్‌పుర్ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరతను బయటపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అరెస్టు తర్వాత నాకు ప్రాణహాని ఉందనిపించింది. మార్గమధ్యలో నన్ను ఎన్‌కౌంటర్ చేయనందుకు ఎస్‌టీఎఫ్‌కు ధన్యవాదాలు’' అని చెప్పారు.
అరెస్టుకు కారణం అది కాకపోవచ్చు
మత ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపడాన్ని తాను కోరుకోవడం లేదని ఖాన్ అన్నారు. తనను అరెస్టు చేయడానికి ఎన్‌ఆర్‌సీ నిరసనలు కారణం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
'జైలులో ఐదురోజులకోసారి రెండు రొట్టెలు మాత్రం ఇచ్చేవారు. పేగులు నకనకలాడేవి. ఇటుకలనైనా తినేయాలనిపించేది.' అని 'ఈటీవీ భారత్'కు ఖాన్ వివరించారు. తాను పోలీసు నిర్బంధంలో ఉన్నప్పుడు కుటుంబమంతా నానాపాట్లు పడిందని, ఏడున్నర నెలల కుమారుడు తనను ఇప్పుడు గుర్తు పట్టడం లేదని, అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనను అగౌరవపరచాలని చూసినవారికి 138 కోట్ల మంది భారతీయులు సమాధానం ఇచ్చారని చెప్పారు.
ఇదీ చూడండి: రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!