కశ్మీర్‌పై కొందరు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని... భారత్ తన వాదనను నిలబెట్టుకుంటుందన్నారు విదేశాంగమంత్రి జైశంకర్. కశ్మీర్ అంశం అంతర్గతమైనదేనని పునరుద్ఘాటించారు. మోదీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.... విదేశాంగ శాఖ ప్రగతి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను జైశంకర్ వివరణ ఇచ్చారు.
పొరుగు దేశం నుంచి ప్రత్యేక సవాలును భారత్ ఎదుర్కుంటోందని దాయాది పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు . సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకూ సాధారణ పొరుగుదేశంగా మారదని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న సార్క్ దేశాల సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రితో భేటీ అవడం అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని స్పష్టంచేశారు.
దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా విదేశాంగ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చామన్న జైశంకర్.... 370 అధికరణ రద్దు, దీర్ఘకాల సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాల్లో భారత వైఖరిని అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించామని తెలిపారు.
భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని.. భవిష్యత్తులో ఇవి మరింత బలపడే దిశగా చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రి వెల్లడించారు.
"భారత్, అమెరికా మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంతో సంబంధాలపై నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. మేం ప్రస్తుతం ఈ సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని వృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందని ఆకాంక్షిస్తున్నా. వాణిజ్య వ్యవహారాల్లో సమస్యలు సాధారణమైనవే."
-జైశంకర్, విదేశాంగ మంత్రి.
వంద రోజుల పాలనలో.. ఆఫ్రికాతో బంధాలు బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు జైశంకర్. ఆఫ్రికాలో 18 రాయబార కార్యాలయాలను ప్రారంభించే పని ముమ్మరంగా జరుగుతోందని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'నిర్మానుష ప్రదేశాల ద్వారా ఉగ్రవాదుల చొరబాటు'