చిన్న పిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ).. ఇతర దేశాల్లో తరచుగా వచ్చే వ్యాధి. కానీ, గుజరాత్ సూరత్ నగరంలో 7 రోజుల శిశువులో గుర్తించారు వైద్యులు. ఇంత చిన్న వయసు చిన్నారుల్లో ఎంఐఎస్ కనిపించటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు.
భండేరిలోని ఓ కుటుంబంలో ఆడబిడ్డ జన్మించింది. శిశువుకు 3 రోజుల తర్వాత జ్వరం రాగా.. ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజులు గడిచిన తర్వాత కూడా జ్వరం తగ్గకపోవటం వల్ల కరోనా పరీక్ష చేశారు. ఇందులో పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
సందేహంతో యాంటీబాడీ టెస్టులు..
అనంతరం ఆమె తల్లికి కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ అని వచ్చింది. మరోవైపు చిన్నారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. ఏ సమయంలోనైనా గుండెపై ప్రభావం పడే సూచనలు కనిపించటం వల్ల శిశువుకు ఎంఐఎస్-సీ ఉందేమోనని అనుమానించారు వైద్యులు.
ఫలితంగా తల్లీబిడ్డలకు కరోనా యాంటీబాడీ టెస్టులను నిర్వహించగా.. ఇద్దరిలోనూ ప్రతిరోధకాలు ఉన్నట్లు గుర్తించారు. గర్భిణిగా ఉన్నప్పుడే ఆమెకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరణకు వచ్చారు. కానీ, ఆ సమయంలో ఎవరూ గమనించకపోవచ్చని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఆమె నుంచి గర్భంలోని శిశువుకు యాంటీబాడీలు చేరి ఉంటాయని భావిస్తున్నారు.
చికిత్స లేదు..
చిన్నారి శరీరంలోకి యాంటీబాడీలు ప్రవేశించటం వల్ల మెదడు, హృదయం, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని నైన్స్ పిల్లల ఆసుపత్రి వైద్యులు అశోఖ్ గోతి స్పష్టం చేశారు. ఈ విషయమై అమెరికా, జర్మనీ వైద్యులతో సంప్రదించామని, అయితే ఇంత చిన్న వయసులో ఈ వ్యాధి ఎవరికీ రాలేదని చెప్పినట్లు వివరించారు. దీనికి ఎలాంటి చికిత్స లేదని తెలిపారు.
అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా చిన్నారికి అశోక్ చికిత్స అందించారు. 15 రోజుల తర్వాత చిన్నారి కోలుకుంది.
![mis c in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-doctor-child-7200931_01102020165941_0110f_1601551781_222.jpg)
ఇదీ చూడండి: ఎడారి రాష్ట్రంలో 'కుంకుమ' సిరులు